mt_logo

11 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయమైంది, అభివృద్ధి దూరమైంది: కేటీఆర్

11 నెలల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందట. సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారు అని దుయ్యబట్టారు.

కానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారు. 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారు. వందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు అని విమర్శించారు.

పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారు అని మండిపడ్డారు.

ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారు. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారు. 11 నెలల పాలనలో సంక్షేమం మాయమయింది, అభివృద్ధి దూరమయింది అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుంది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుంది అని పేర్కొన్నారు.