పౌరసరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 1,100 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాసనసభలో సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు.
రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తుందంటూ మండిపడ్డారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తే దానికి లెక్కలతో సహా వివరిస్తే దాన్ని కూడా బుల్డోజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షం ఏం చెప్పిన సరే ప్రభుత్వానికి రుచించటం లేదని విమర్శించారు. సివిల్ సప్లైస్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 1,100 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిలో మంత్రి గారి హస్తం లేకపోయిన సరే పెద్దల హస్తం ఉందన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఐతే ఈ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా నిన్న రాత్రి అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాక్ఔట్ చేశారు.