mt_logo

మరిన్ని వేధింపులు ఉంటాయి.. ప్రజా పోరాటం నుంచి పక్కకు జరగవద్దు: బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ వైఫల్యాలను, అవినీతిని ఎత్తి చూపినందుకు బీఆర్ఎస్ పార్టీపైన ఫ్రస్ట్రేటెడ్‌గా ఉన్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ మాపై చేస్తున్న రాజకీయ వేధింపుల ప్రహసనంలో గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలన్ని ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయి అని జోస్యం చెప్పారు.

ఇప్పటిదాకా మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా వారియర్లకి ధన్యవాదాలు తెలుపుతూ.. కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులను, కుట్రలను, ప్రాపగాండాను, అబద్ధాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా డిఫ్ ఫేక్ టెక్నాలజీ వంటి అనేక అంశాల సహకారంతో వారి పెయిడ్ ఆర్టిస్ట్‌లతో చేసే దుర్మార్గపూరిత కుట్రలు చూడాల్సి వస్తది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వారి పెయిడ్ సోషల్ మీడియా అంతా కలిసి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయబోతున్నారు అని పేర్కొన్నారు.

ఇలాంటి కుటిల ప్రయత్నాలతో అయోమయానికి గురి కావడం, ఆగం కావడం మనకు అవసరం లేదు. ఇలాంటి కుటిల ప్రయత్నాల వలన ప్రజా సమస్యలపైన మనం చేస్తున్న పోరాటం నుంచి పక్కకు జరగవద్దు. తెలంగాణ ప్రజల కోసం చేస్తున్న మన పోరాటంపైనే దృష్టి సారిద్దాం అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అవినీతిని, అసమర్ధతను, హిపోక్రసీని ఎత్తిచూపుదాం.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అమలుకై వారిపైన ఒత్తిడి తీసుకువద్దాం అని అన్నారు.