- ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి నాలుగవ తేదీన 10 గంటలకు అశోక్ నగర్లో యువతతో సమావేశం అవుతానన్న కేటీఆర్
- అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేస్తాం..
- గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను మరింతగా పెంచుతాం..
- ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తాం..
- నోటిఫికేషన్లు ఫలితాల జారీపైన ఉన్న కేసుల పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటాం..
ఎన్నికల ఫలితాలు తెల్లారి ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువకులతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ప్రత్యేకంగా సమావేశం అవుతానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అశోక్‌నగర్‌తో పాటు పలు యూనివర్సిటీలలో ఉత్సవ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కొంతమంది విద్యార్థులు కేటీఆర్‌ని కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన పలు అంశాలపైన మంత్రి కేటీఆర్‌తో విస్తృతంగా సంభాషించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న అన్ని సమస్యల పైన కూలంకషంగా చర్చించేందుకు ఎన్నికల ఫలితాలు వెలువడిన తెల్లారి 4వ తేదీన 10 గంటలకి అశోక్‌నగర్‌లో ప్రభుత్వ ఉద్యోగార్డులతో సమావేశం అవుతానని వారికి కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో తమ నిబద్ధతను ఎవరూ ప్రశ్నించే అవకాశం లేదని… ముఖ్యంగా సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కూడా కల్పించని కాంగ్రెస్ పార్టీకి అసలే లేదన్నారు. తాము రాష్ట్ర యువకులకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి రెట్టింపుకు పైగా 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 1,62,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. దేశంలో తెలంగాణ కన్న ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను గత పది సంవత్సరాల లో భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదన్నారు. తమపై కేవలం రాజకీయ దురుద్దేశంతో ఉంచుకొని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విషయంలో రాష్ట్ర యువకులకు సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా పది సంవత్సరాలలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తే ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు యువకులకు గణాంకాలతో సహా వివరించాలని సవాల్ చేశారు. రాష్ట్ర యువకులు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం ఈ అంశం పైన చేస్తున్న అసత్య పూరిత ప్రాపగాండాను తిప్పికొట్టి నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల తాలూకు వివరాల జాబితాను, ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ప్రక్రియ తాలూకు వివరాలను గణాంకాలతో సహా అందించారు.
మంత్రి కేటీఆర్ తమతో ఈ అంశం పైన విస్తృతంగా సంభాషించడం తమకు సంతోషాన్ని కలిగించిందని మంత్రితో సమావేశమైన ప్రభుత్వ ఉద్యోగార్థులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియకు సంబంధించిన కొన్ని సమస్యల వలన యువతలో కొంత ఆందోళన నెలకొందని వారు తెలిపారు. ఈ అంశాల పైన మంత్రి కేటీఆర్ తో తమ అభిప్రాయాలను సూచనలను పంచుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మరియు రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్య అర్హతల విషయంలో ఉన్న కొన్ని సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం ఉందని ఇందుకు సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలను అందించారు. కేవలం ఈ సాంకేతికపరమైన అంశాల ఆధారంగా అనేక న్యాయపరమైన కేసులు ఎదురవుతున్నాయని, వీటి వలన భర్తీ ప్రక్రియ కు ఆటంకం కలుగుతుందని తెలిపారు.
విద్యార్థులు చెప్పిన సలహాలు సూచనలను పూర్తి సానుకూల దృక్పథంతో ముందుకు తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా ఒకవైపు తాము కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన పట్ల సంతృప్తి గానే ఉన్న మరిన్ని ఉద్యోగాలు పెంచాలన్న విద్యార్థుల సూచన మేరకు గ్రూప్-2 ఉద్యోగాలను పెంచి వెంటనే నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామని తెలిపారు. దీంతోపాటు కచ్చితంగా అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు విషయంలో విద్యార్థుల ఆకాంక్షలకు అనుకూలంగా పూర్తిగా ప్రక్షాళన కూడా చేసే కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకు వెళ్తామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామన్నారు. వివిధ నోటిఫికేషన్లు మరియు భర్తీ ప్రక్రియ పై ఉన్న కోర్టు కేసుల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఒక యువకుడిగా దాదాపు దశాబ్ద కాలం పాటు ప్రైవేటు రంగంలో ఒక ఉద్యోగ పని చేసిన అనుభవం తనకు ఉన్నదని, అది ప్రభుత్వ ఉద్యోగమైన, ప్రైవేటు ఉద్యోగమైన దాన్ని సాధించేందుకు తర్వాత దాని నిర్వర్తించేందుకు ఎదురయ్యే సవాళ్లు సమస్యలను కచ్చితంగా తాను అర్థం చేసుకోగలుగుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో విద్యార్థులకు, యువకులకు ఒక సోదరుడిగా భరోసా ఇస్తున్నానని తెలిపారు. ఎన్నికలు ముగిసిన తెల్లారే యువకులతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు అందరితో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పైన యువకుల ఆకాంక్షలకు అనుగుణమైన ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌తో దాదాపు రెండు గంటల పాటు జరిగిన సంభాషణ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.