mt_logo

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా: మంత్రి కేటీఆర్ 

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని, ప్రజలు ఇప్పటికే కేసీఆర్‌కు అండగా నిలవాలనే నిర్ణయానికి వచ్చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత స్థితప్రజ్ఞత కలవారో తెలుసునని, అది గతంలో రెండు సార్లు ఎన్నికల్లో  రుజువు కూడా అయ్యిందని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే సాధ్యమని ప్రజలకు బాగా తెలుసునన్నారు. 

కాంగ్రెస్ ఏం చేసిందో, ఏం చేయగలదో, అంతా ప్రజలకు తెలుసునని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంకలనం చేసిన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విశ్లేషణ ’’కాంగ్రెస్ చేసిందేంది?‘‘ అనే పుస్తకాన్ని సోమవారం నాడు కేటీఆర్ ప్రగతి భవన్ క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఏం వెలగబెట్టిందో ఈ పుస్తకం బయటపెట్టిందన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడం కాంగ్రెస్ వల్ల కాదని, డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అంతా పింక్ మయం కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ అంటే  తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ఆత్మలాంటిదని, తెలంగాణకు కేసీఆర్ ప్రాణమని చెప్పారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న తెలంగాణ పునర్నిర్మాణధారి కేసీఆర్ ను ప్రజలు గెలిపించుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణను ధ్వంసం చేసెందెవరో? తెలంగాణను పునర్నిర్మిస్తుందెవరో తెలంగాణ మట్టికి తెలుసునన్నారు. కాంగ్రెస్ ఎన్ని టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలను ప్రదర్శించినా, ఈ గోల్ మాల్ కాంగ్రెసును ప్రజలు నమ్మరన్నారు. 

తెలంగాణ కన్నీళ్ళను తుడిచి బీడు భూములపై గంగమ్మను ప్రవహింపచేస్తున్న కేసీఆర్ ను తెలంగాణ తన గుండెల్లో దాచుకుంటుందన్నారు. చెరువుల్ని చంపి, అడవుల్ని ధ్వంసం చేసి, ప్రగతి నిరోధకంగా మారి,  గ్రామస్వరాజ్యాలను నిర్విర్యం చేసి 60 ఏళ్ళు తెలంగాణను నిస్తేజంగా మార్చిన కాంగ్రెస్ అసలు రంగు ప్రజలకు బాగా తెలుసునని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు పన్నినా 30 వ తేదీన బ్యాలెట్ బాక్సుల్లో బీఆర్ఎస్ విజయం పదిలమన్నారు.