mt_logo

బీఆర్ఎస్ జెండా లేకపోవటం వల్లనే లోక్‌సభలో తెలంగాణ పదం నిషేధించబడింది: కేటీఆర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవటాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడారు. గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని మేము చెబుతున్నదే.. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు అక్కడ ఉండి చెప్పారు. ఇక్కడున్న నాయకులకు సమాధానం చెప్పటానికి కేసీఆర్ గారు అవసరం లేదు. మేము మీ అందరికీ తప్పకుండా సమాధానం చెబుతాం అని అన్నారు.

ప్రభుత్వం తీర్మానం అని చెబుతూ దాని కాపీలను మాత్రం మాకు ఇవ్వలేదు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు మేము సంపూర్ణ మద్దతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి సంయమనం, ఓపిక ఉండాలి.. నన్ను మేనేజ్‌మెంట్ కోటా అంటున్నారు.. నేను కూడా పేమెంట్ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చు. అయ్యా, తండ్రి కోటా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అంటున్నారా? రాజీవ్ గాంధీ గారిని అంటున్నారా? అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ప్రారంభించిన చర్చకు మేము వంద శాతం మద్దతిస్తున్నాం.. స్వాగతిస్తున్నాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేము తెలంగాణ ప్రజల పక్షమే. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేము ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తాం. ఉమ్మడి ఏపీలో తెలంగాణ పదాన్ని నిషేధించినట్లే.. ఇప్పుడు లోక్‌సభలో తెలంగాణ పదాన్ని నిషేధించారు.. బీఆర్ఎస్ జెండా లేకపోవటం కారణంగానే లోక్‌సభలో తెలంగాణ అనే పదం నిషేధించబడింది అని అన్నారు.

ఇప్పుడు 8+8 అంటే గుండు సున్నా అనే పరిస్థితిని తెచ్చారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పదేళ్లుగా మనకు జరిగిన అన్యాయాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. తెలంగాణకు అన్యాయం జరగటంపై మోడీ గారితో కేసీఆర్ సఖ్యతతో లేకపోవటం కారణంగానే జరిగిందని సీఎం గారు అన్నారు. మేము సఖ్యతతో ఉంటామని అంటూ హైదరాబాద్‌లో ప్రధాని మోడీని బడే భాయ్ అని రేవంత్ రెడ్డి గారు సంబోధించారు. కానీ మేము గతంలో చెప్పిందే మీకు ఇప్పటికీ అర్థం అయ్యింది. ఏమీ చేసిన సరే వాళ్లది తెలంగాణకు అన్యాయం చేయాలన్న తత్వమే ఉందన్నది మీకు ఇప్పుడు బోధపడింది అని వ్యాఖ్యానించారు.

కేంద్రం సహకరించకపోయినా సరే మేము చాలా సాధించాం.. కానీ మీలాగా చేయని పనులకు క్రెడిట్ తీసుకోం. మేము తెచ్చిన, చేసిన పనులను మీ ఖాతాలో వేసుకున్నారు.. దానికి కూడా బాధలేదు. మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను మీరు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.. కానీ మేము అలా కాదు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు మేలు చేయాలి.. పక్క రాష్ట్రానికి సాయం చేస్తే బాధ లేదు.. కానీ మనకు నిధులు ఇవ్వకపోవటం బాధగా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణకు అన్యాయం చేసే వాళ్లు ఎవరైనా సరే వాళ్ల మెడలు వంచేందుకు బీఆర్ఎస్ ఎప్పటికీ సిద్ధంగా ఉంటుంది.. తెలంగాణ ఏర్పాటు అయిన వెంటనే అన్యాయంగా అనాడు ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారు. అప్పుడు ముందుగా నిరసన తెలిపింది కేసీఆర్ గారే. రాష్ట్ర బంద్‌కు కూడా పిలుపునిచ్చారు. తెలంగాణకు ప్రత్యేక స్టేటస్ అడిగింది కూడా కేసీఆర్ గారు. లక్ష కోట్లకు పైగా ఆర్థిక సాయం కావాలని కోరారు. ప్రతి విషయంలో సాయం కోసం కేంద్రం దగ్గరకు ఎన్నోసార్లు వెళ్లి విజ్ఞప్తి చేశాం. కేంద్రం సహకారం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి కొన్ని సాధించాం.. కొన్ని సాధించలేకపోయాం అని తెలిపారు.

సీఐఐ, ఎన్ఆర్సీ, విద్యుత్ సంస్కరణాలకు సంబంధించి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు కూడా లోక్‌సభలో నిరసన తెలిపాం.. ఓబీసీ జనాభా గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశాం. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టాలను రూపొందించినప్పుడు కూడా మేము వ్యతిరేకించాం. ధాన్యం కొనుగోలు చేయం, నూకలు తినండి అని కేంద్రం పెద్దలు అంటే మొత్తం మంత్రివర్గం ఢిల్లీకి పోయి ధర్నా చేశాం.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మనకు ఇవ్వకపోవటంపై కూడా ఆందోళన చేశాం ఆని గుర్తు చేశారు.

మన సీఎం గారు కూడా కేంద్రానికి ఎన్నో విజ్ఞాపనలు చేశారు. కానీ మీకు కూడా న్యాయం జరగలేదన్నది ఇప్పటికీ అర్థమైంది. యాచిస్తే కాదు శాసిస్తేనే ఏదైనా సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పేవారు. ఇప్పుడు అదే ఆలోచన చేయాలని నేను ప్రజలను కోరుతున్నా. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా సరే మేము తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేశాం అని తెలిపారు.

హైకోర్టు విభజన కూడా పోరాటం చేసి సాధించుకున్నాం. కృష్ణా ట్రిబున్యల్ విషయంలో పదేళ్లు నిలదీస్తే మొన్న కేంద్రం రిఫర్ చేసింది. శాసించి చేసుకోవాలే తప్ప.. యాచిస్తే ఈ కేంద్రం లొంగదు. కేంద్రంలో బీజేపీ వాళ్ల నీతిమాలిన వ్యవహారాన్ని మేము ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాం.. ములుగు ట్రైబల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేదు.. మన ప్రాజెక్ట్‌లకు జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాలంతో పోటీపడి మరీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కట్టింది. కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా చాలా వరకు మనకు మనమే అభివృద్ధి చేసుకున్నాం అని కేటీఆర్ అన్నారు.

మా ఉద్యోగాలు మాకే అంటూ 95 శాతం స్థానిక రిజర్వేషన్లు సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి అక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ ఇస్తే దాని మీద కూడా నిరసించాం. మనకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు.. ఈ విషయంలో అందరం కలిసి పోరాటం చేద్దాం. మనకు కేంద్రం 156 మెడికల్ కాలేజ్‌లలో ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. అయినా సరే కేసీఆర్ గారు సొంతంగా ఒక్కో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేశారు. నవోదయ స్కూల్ మనకు ఇవ్వకపోయినా సరే.. వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నాం.. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తే మేమే అడ్డుకున్నాం. సింగరేణి గనులు వేలం వేస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు, భట్టి గారు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించారు అని విమర్శించారు.

మోటార్లకు మీటర్లు పెట్టాలని భావిస్తున్నారు.. అదానీ సంస్థకు డిస్కంలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.. మా మెడ మీద కత్తిపెట్టినా సరే మేము రాజీ పడలేదు.. మీరు కూడా రాజీ పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. విద్యుత్ సంస్కరణల పేరుతో డిస్కంలను ప్రైవేటీకరణ చేస్తారు.. దానికి ప్రభుత్వం లొంగకూడదు. డిస్కంలు ప్రైవేటీకరణ చేయం.. అదానీకి ఇవ్వమని బిల్లుల వసూళ్లు అప్పగించమని స్టేట్మెంట్ ఇవ్వండి. కేంద్రం మనల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము ఊరుకోకుండా పనులు చేశాం ఆని అన్నారు.

రాష్ట్రం దివాళా తీసిందని స్వయంగా సీఎం గారే మాట్లాడితే రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయా? బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. చీకటి ఒప్పందాలు, విలీనం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూమ్మటికీ మీరిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు అయ్యేదాకా మిమ్మల్ని వదిలిపెట్టం అని స్పష్టం చేశారు.

కేంద్రం ఇయ్యలేదని మేము ఆగలే.. మేము అభివృద్ధి పనులు చేసుకుంటూ పోయాం.. తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదలతో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశాం. దేశంలో జీఎస్డీపీని భారీగా పెంచి దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా కష్టపడ్డాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, పేదరిక నిర్మూలనలో ముందున్నాం.. వ్యవసాయంలో తెలంగాణను నంబర్ వన్ చేసినం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాం అని అభిప్రాయపడ్డారు.

ఐటీఐఆర్ ఇయ్యాల్సిందే.. అది తెస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అది తేవాలని ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ కాదు.. లోక్‌సభలో కాంగ్రెస్ 99 మంది ఎంపీలు పోరాటం చేయాలి. మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం.. మా జెండాలు మారదు.. తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం. చీకటి ఒప్పందాలు, విలీనం అంటూ రేవంత్ రెడ్డి గారు తప్పుడు సమాచారం ఉన్నట్లు ఉంది. మేము ఎక్కడికి పోము.. మిమ్మల్ని ఎండగడుతాం.. మీపై పోరాడుతాం.. ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం అని హెచ్చరించారు.

పంజాబ్‌కు కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగితే ఆ రాష్ట్ర ఎంపీలు నిరసన తెలిపారుమరి మన రాష్ట్ర ఎంపీలు ఎక్కడ పోయారు.. ఎందుకు నిరసన తెలుపలేదు. బడేభాయ్, ఛోటే భాయ్ అని అన్నదమ్ములు సెంటిమెంట్ తెస్తే మన రాష్ట్రానికి ఏం వచ్చింది. రాష్ట్రానికి అన్యాయం జరిగితే కలిసి కొట్లాడతాం.. కానీ గతంలో ఇదే బీజేపీ వాళ్లు గవర్నర్ ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడితే కేంద్రానికే సహకరించారు. కానీ తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పని చేస్తుంది.. ఇప్పుడు కూడా చెబుతున్నాం.. ఏ విలీనం, ఏ చీకటి ఒప్పందాలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు.. ఏం చేసినా బజాప్తా చేస్తాం.. మీ లాగా మేము మోడీ పేరు తీసుకోవటానికే భయపడే ప్రసక్తే లేదు అని పేర్కొన్నారు.

ఇప్పటికీ కూడా సీఎం గారి పనులను ఢిల్లీలో బీజేపీ ఎంపీలే చక్కబెడుతున్నారు. కానీ మాకు ఆ అవసరం లేదు.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతాం.. ఒక దళితుడు రాష్ట్రపతి అవుతున్నారంటే అప్పుడు మేము బీజేపీకి సపోర్ట్ చేశాం. ఒక తెలుగు వ్యక్తి ఉప రాష్ట్రపతి అవుతుంటే ఖచ్చితంగా మేము మద్దతిచ్చాం. మా పార్టీని విలీనం చేసేందుకు మేము రేవంత్ రెడ్డి లాగా పరాన్న జీవులం కాదు అని చురకలు పెట్టారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీతో చీకటి ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు 8 ఎంపీలను కాంగ్రెస్ పార్టీకు ప్రజలు ఇస్తే మీరు రాష్ట్రానికి తెచ్చింది గుండు సున్నా దాని గురించి ప్రజలు అడుగుతున్నారు.. సీఎం గారు సమాధానం చెప్పాలె.. ఇప్పుడు ఈ చర్చను 21 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించలేకపోయినా మీ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవటానికే పెట్టారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేయండి.. రాజ్యసభలో మా ఎంపీలు కూడా కలిసి వస్తారు ఆని తెలిపారు.