ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేసిన బండి సంజయ్ తీరును తప్పుబట్టారు.
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విజయమంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లాయర్ చేసిన కృషితో ఒకరికి బెయిల్ వస్తే.. బీఆర్ఎస్ సపోర్ట్ కారణంగా ఆ లాయర్ రాజ్యసభలో స్థానం పొందారంటూ వివాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం వాదనలు వినిపించిన లాయర్‌కు కాంగ్రెస్ తరపున రాజ్యసభ సీటు వచ్చేలా కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారంటూ ఆయన చేసిన పోస్ట్‌లో కామెంట్స్ చేశారు. వైన్ అండ్ డైన్ క్రైమ్‌లో పార్టనర్స్ అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆయన స్థాయిని మరిచి సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసేలా బండి సంబయ్ కామెంట్స్ చేశారు.
దీనిపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ ట్వీట్‌కు స్పందిస్తూ కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడతారా అని విమర్శించారు. ఇలా దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.