mt_logo

ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం: కేటీఆర్

గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలను సేకరించి.. ఆ వివరాలను జిల్లా కలెక్టర్లకు.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అదే విధంగా రెండు రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలుపెడతాం అని అన్నారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రుణమాఫీ వైఫల్యంపైన గ్రామాలకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అని పేర్కొన్నారు.

సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపైన దాడి చేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలి. ముఖ్యమంత్రి సొంత మీడియా ప్రతినిధులు కమలాసన్ రెడ్డి లాంటి సీనియర్ అధికారిపైన దాడి చేసినంత పని చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి అధికారిక మీడియానేమో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపైన దాడి చేస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి, ప్రభుత్వమేమో.. ప్రభుత్వ ఆస్తులపైన దాడి చేస్తుంది అని ఆక్షేపించారు.

47 లక్షల మందికి రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పింది. రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్లు అవసరమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. రూ. 31 వేల కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించింది.. రూ. 26 వేల కోట్లంటూ బడ్జెట్ ఆమోదించింది. చివరికి రూ. 17,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశారు అని అన్నారు.

కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు.. రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం.. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం. రెండు రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలుపెడతాం.. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం అని స్పష్టం చేశారు.

ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తాం. అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతాం.. మా కాల్ సెంటర్‌కి దాదాపు లక్షా 20 వేల ఫిర్యాదులు వచ్చాయి. ఒక ప్రొఫార్మ తయారుచేసి దాని ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తాం అని కేటీఆర్ తెలిపారు.

మొత్తం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే గాని సీనియర్ నాయకులు కానీ బాధ్యత తీసుకుంటారు. గ్రామంలోని ప్రతి ఇంటికి మా పార్టీ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తాయి. కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. రైతులు అంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించేలా అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తోందిఒకవైపు ముఖ్యమంత్రి వంద శాతం రుణమాఫీ పూర్తి అయిందని చెబుతుంటే.. ప్రభుత్వము రుణమాఫీ కానీ వాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టడం వారి డొల్ల వైఖరికి నిదర్శనంప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేయించడం దేనికి నిదర్శనం అని దుయ్యబట్టారు.

కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫాక్స్‌కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.రేవంత్ రెడ్డి మాటలు, పరిపాలన వైఫల్యం కారణంగా ఫాక్స్‌కాన్ ఏమైనా వెనక్కి వెళ్ళిపోయిందా? 40,000 ఉద్యోగాలతో చైనా తర్వాత అతిపెద్ద రెండో క్యాంపస్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని సంస్థ చెప్పటం దేనికి నిదర్శనం అని మండిపడ్డారు.

ఫాక్స్‌కాన్ పెట్టుబడుల పైన, విస్తరణ పైన ప్రభుత్వం నిజనిజాలను బయటపెట్టాలి. తదుపరి విస్తరణను ఫాక్స్‌కాన్ సంస్థ చేస్తుందా లేదా అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు, చేస్తున్న దుష్ప్రచారం కారణంగానే ఫాక్స్‌కాన్ కంపెనీ బెంగళూరుకి పోయిందా అని అనిపిస్తుంది అని అన్నారు.

24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరవుతాను.. గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన దురాగతలను అందజేస్తాను అని తెలిపారు.