mt_logo

ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే రేవంత్ బజారు భాష మాట్లాడుతున్నాడు: కేటీఆర్

గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలు అంటించారు.

మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రుణమాఫీపైన తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం. రుణమాఫీ పూర్తయ్యేదాకా కాంగ్రెస్ పార్టీపైన పోరాటం చేస్తాం. గ్రామస్థాయిలో కూడా రుణమాఫీపై పోరాట కార్యక్రమాలను చేపడతాం.. తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలు మళ్లీ చేస్తాం అని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతుంది అని అనుకోవడం లేదు బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్లుగా ఆ పార్టీ పరిస్థితి తయారైంది అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేసిన డిక్లరేషన్ల పేరుతో ఏ ప్రాంతాల్లో సమావేశాలు పెట్టిందో వాటిని అమలు చేయాలంటూ ఆయా ప్రాంతాల్లో సెప్టెంబర్‌లో పార్టీ కార్యక్రమాలు ఉంటాయి.. ఆరు గ్యారంటీల అమలపైన కూడా బీఆర్ఎస్ పోరాటాన్ని కొనసాగిస్తుంది. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి రైతులను మోసం చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్పింది నిజం.. రైతుల ఖాతాలకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరినయ్. అమలు చేయలేని చేతగానితనంతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు ఇరుక్కపోతున్నారు. రుణమాఫీ పేరుతో ఎన్నో మీటింగ్‌లు పెట్టి ఇన్ని నెలల తమాషా తర్వాత రైతుబంధు రెండు విడతల్లో రూ. 7,500 కోట్లు మాత్రమే ఇచ్చారు అని అన్నారు.

రాష్ట్రం అప్పులపైన రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోంది.. జీతభత్యాలు లాంటి ఖచ్చితమైన ఖర్చులు పోను రాష్ట్రం రెవెన్యూ సర్‌ప్లస్ స్టేట్‌గా ఉంది. 2014 లో 300 కోట్లు రెవెన్యూ సర్‌ప్లస్ ఉంటే 2023 లో రూ. 5,900 కోట్లు సర్‌ప్లస్‌గా వారికి ఇచ్చాం. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం సీఎం, మంత్రులు అప్పులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కేవలం ప్రజా అంశాల నుంచి దృష్టి మరలించేందుకే సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ పైన అబద్ధాలు చెప్పినందుకు ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. ఆగస్టు 15లోగా ఎలాగు రుణమాఫీ చేయలేదు.. కనీసం ఎప్పటిలోగా చేస్తారో అదైనా ముఖ్యమంత్రి చెప్పాలి. రైతు భరోసాను ఎప్పటిలోగా రైతుల ఖాతాలో వేస్తారో కూడా చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. విత్తనాల నుంచి మొదలుకొని ఎరువులు, విద్యుత్ వరకు అన్నింట రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు.

రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ప్రధానితో పాటు అనేక అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అదానీ సంస్థల అక్రమాలపైన హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం 10 సంవత్సరాల పాటు మా మెడ మీద కత్తిపెట్టిన సరే అదానీని రాష్ట్రంలోకి రానివ్వలేదు.. ప్రధాని విద్యుత్ మీటర్లను, అదానీ బొగ్గును తెలంగాణలోకి రానియ్యలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలో అదానీ వ్యాపారాలు చేస్తున్నారు అని విమర్శించారు.

రూ. 12,400 కోట్ల రూపాయల మేరకు అదానీతో పెట్టుబడులకు సంబంధించి రేవంత్ రెడ్డి స్వయంగా ఎంఓయూ కుదుర్చుకున్నాడు. అసలు అదానీ మంచివాడా చెడ్డవాడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలి అని అన్నారు.

తెలంగాణ తల్లి అంటే తెలంగాణ జాతికి సంబంధించిన అస్తిత్వానికి ప్రతీక. అద్భుతంగా కట్టుకున్న సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష రాహుల్ గాంధీ అయ్య విగ్రహం పెట్టి రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని నేను కూడా అనవచ్చు. రేవంత్ రెడ్డి తన పార్టీ నాయకుల దగ్గర మార్కులు వేయించుకోవడానికి తెలంగాణ జాతి మొత్తాన్ని అవమానిస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఏమిటి? అని అడిగారు.

అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం అంజయ్య పార్క్ ముందు పెట్టడంలో అంతర్యం ఏమిటి? గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుంది . 10 సంవత్సరాలలో నూతన సచివాలయం కట్టలేదన్న విషయం తెలివి తక్కువ రేవంత్ రెడ్డికి తెలియదు. సచివాలయం ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించాం అని అన్నారు.

కాంగ్రెస్ నాయకులు ఇదే అహంకారంతో మాట్లాడితే… మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును ఖచ్చితంగా మారుస్తాం. తెలంగాణ వాళ్లకు ఉన్న ఆత్మగౌరవాన్ని అహంకారం అనుకుంటే దానికి నేనేం చేయలేను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి బానిసలు. 9 నెలలలో రేవంత్ రెడ్డి సాధించిన గొప్ప విజయం ఢిల్లీకి 20 సార్లు పోయిరావడం అని దుయ్యబట్టారు.

కేసీఆర్ గుర్తులను తుడిపి వేయాలి అంటే తెలంగాణ ఉండదు… తెలంగాణ లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ఏమన్నా కుట్ర చేస్తున్నాడేమో చూడాలి. తెలంగాణ అనే పేరును ఏమైనా మారుస్తాడేమో చూడాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇతర ప్రాంత వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీని పంపారు.. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని పదవులను తెలంగాణేతరులకు అప్పజెప్పుతుంది.. ఇతరులకు అప్పచెప్పుతున్నది. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతాడు అని ముఖ్యమంత్రి అంటే మరి తెలంగాణ నుంచి ఎంపికైనా ఎనిమిది మంది ఎంపీలు గాడిదలు కాస్తారా? మాదిగ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ మను సింఘ్వీకి ఇచ్చారు అని విమర్శించారు.