mt_logo

కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారు: కేటీఆర్

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయి.. పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రతి రోజు తెలంగాణ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అందుబాటులో ఉంటా ప్రకటించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజీ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుంది.. ఎన్నికలకు ముందే బ్యారేజీ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? అని అడిగారు.

మున్ముందు బ్యారేజీకు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుంది.. ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసు.. వారు బ్యారేజీను ఏమైనా చేయగలరు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోంది అని దుయ్యబట్టారు.

ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదు. ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమే.. అయితే 2 టీఎంసీల నీరు ఎత్తిపోస్తే సరిపోదు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారు అని పేర్కొన్నారు.

నిన్న మేము మేడిగడ్డ వెళ్ళినప్పుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి.. 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడిగడ్డ బ్యారేజీ తట్టుకుని నిలబడింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు అది ఎన్డీఏ రిపోర్టు.. కాంగ్రెస్ బీజేపీలు ఏ విషయంలో విభేదించినా కాళేశ్వరం మీద ఓకే వైఖరితో ఉన్నారు. ఉత్తమ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటారంటున్నారు.. బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటారు. పోలవరం కాఫర్ డాం కొట్టుకుపోయినపుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎక్కడ పోయింది అని ప్రశ్నించారు.

90 టీఎంసీల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్నాయి.. 90 టీఎంసీల నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో సమానం. భేషజాలకు పోకండి.. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి. ఎల్లంపల్లిలో 16 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి.. పద్నాలుగు టీఎంసీల నీళ్లు హైదరాబాద్కు నిలువ ఉంచాలి.. రెండు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉంది. ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు, మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు అని కేటీఆర్ తెలిపారు.

ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు.. రాజకీయం చేయకండి. కాళేశ్వరం అనేది కరువుకు ఇన్సూరెన్స్. ఇప్పటికే రాష్ట్రంలో వర్షపాతం 40 శాతం లోటు ఉంది. లిఫ్ట్‌లకు విద్యుత్ ఖర్చు అయితే అవుతుంది.. రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా.. గల్ఫ్‌లో తాగునీళ్ల కోసం ఖర్చు ఎంతయినా పెడతారు అని అన్నారు.

కాళేశ్వరం బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టు.. కాళేశ్వరంకు డబ్బులవుతున్నాయని బాధ పడుతున్నవారు, మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతుందంటున్నారు. అది ఎవరికి లాభం, అవినీతి కోసమే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టా? నీళ్లున్నపుడే ఖాళీ ప్రాజెక్టులు నింపి పెట్టుకోవాలి అని పేర్కొన్నారు.

ఆగస్టు 2 తర్వాత కేసీఆర్‌తో చర్చించి కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్ల విడుదల కోసం కార్యాచరణ ప్రకటిస్తాం.. బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. సెప్టెంబర్‌లో నీళ్లు లిఫ్ట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది.. అది సరి కాదు. మేము కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టినా సరిగా ప్రచారం చేసుకోలేకపోయాము.. చేసింది సరిగా చెప్పుకోలేకే ఎన్నికల్లో ఓడిపోయాం అని అన్నారు.

మెట్రో అలైన్‌మెంట్‌ను ఎంఐఎం మార్చమని ఒత్తిడి చేయడం వల్లే పాతబస్తీ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ సీఎం ప్రతిపక్షనేత అనే మూడ్‌లోనే ఉన్నారు. ఎల్ అండ్ టీ గురించి సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తీరు బాగలేదు. ఇది పెట్టుబడి దారులకు తప్పుడు సందేశం వెళ్లేలా చేసింది.. ఎల్ అండ్ టీ చిన్నా చితకా కంపెనీయా. సీఎం అలా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి అని ధ్వజమెత్తారు.

సీఎంకు అన్నిటిలో స్కాంలు కనిపిస్తున్నాయి.. కోటి బతుకమ్మ చీరల పంపిణీలో స్కాం ఎక్కడ కనిపిస్తోంది. సీఎం రేవంత్ బతుకమ్మ చీరలతో సహా దేంట్లో నైనా విచారణ చేసుకోవచ్చు..రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్‌తో ఏ సీఎం అయినా పోలుస్తారా?ఇంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉంటుందా? అని విచారం వ్యక్తం చేశారు.

షావలి దర్గాపై మేము సుప్రీం కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ కరెక్టే.. రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా వెళుతారా? ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టులో రెయిల్ కారిడార్ ఉంది.. భూసేకరణలో ఇబ్బందులు ఉండవని ఎయిర్‌పోర్టుకు ఆ మార్గంలో మెట్రో ప్రతిపాదించాం అని తెలిపారు.

పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. హైడ్రా కూడా అంతే.. సీఎంకు పేర్లు మార్చే పిచ్చి ఉంది. సీఎం సోదరులు కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నారో మాకు తెలుసు. ఉదయ సింహ, ఫహీమ్ ఖురేషి, అజిత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి షాడో కేబినెట్ నడుపుతున్నారు అని అన్నారు.

ధరణి స్థానంలో ఏదీ వచ్చినా భూమేతే అవుతుంది..ఎక్కడేం జరుగుతుందో మాకు తెలుసు.. అన్నీ బయటకు వస్తాయి. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం పది రెట్లు పెంచుతున్నారు.. ఏం చేస్తారో చూద్దాం. ఈ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి సమయం పూర్తి చేయాలని కోరుకున్నారు.

మోటర్లకు మీటర్లు పెడుతారనే విషయంపై ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోతోంది.. సీఎం రేవంత్ అసెంబ్లీలో విడుదల చేసిన పత్రంలో శోధించి సాధించిందేమీ లేదు. ఉదయ్ స్కీం గురించి పత్రం విడుదల చేసి మోటార్లకు మీటర్లకు సంబంధించిన ఒప్పందం అని రేవంత్ అంటున్నారు. మోటార్లకు మీటర్ల నిబంధన కరోనా సమయంలో కేంద్రం పెట్టింది అని కేటీఆర్ గుర్తు చేశారు.