mt_logo

టైకాన్ కేరళ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

ఈరోజు కేరళలోని కొచ్చి నగరంలో జరిగిన టైకాన్ కేరళ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి అంశంలోనూ రాష్ట్రాల మధ్య పోలిక చేయడం అవసరం లేదని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలకు తమ తమ బలాలు మరియు ప్రాధాన్యతలు ఉన్నాయని గుర్తించి వాటి ఆధారంగా ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలోని రాష్ట్రాలు అనేక రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించాయని, వాటి అనుభవాల నుంచి తగిన పాఠాలు నేర్చుకోవడం ద్వారా అన్ని రాష్ట్రాలు ప్రగతి బాటలో పయనించవచ్చని కేటీఆర్ అన్నారు.

కేరళ రాష్ట్రం సామాజిక మరియు ఆర్థిక రంగాల్లో సాధించిన ప్రగతిని ఆధారంగా తీసుకుని అనేక అంశాలను నేర్చుకునే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత హోదాలో, కేరళ రాష్ట్రంలో ఎంట్రప్రీనియర్‌షిప్ డెవలప్‌మెంట్ కోసం అవసరమైన మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు.

భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు జరిగితే తప్పకుండా పాల్గొంటానని కూడా ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణతో పాటు హైదరాబాద్‌లో ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల వంటి ఉన్నత విద్యాసంస్థల భాగస్వామ్యాలను అవసరమైతే తన వ్యక్తిగత పరిచయాలతో ఏర్పాటు చేసేందుకు సహకారం అందిస్తానని కేటీఆర్ తెలిపారు.

స్వతహాగా మలయాళీలు కష్టపడే తత్వం కలిగిన వారిని ఇదే అంశం ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లిన ముఖ్యంగా యునైటెడ్ వంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించే కేరళ పారిశ్రామికవేత్తలను చూసినప్పుడు అర్థమవుతుందని కేటీఆర్ అన్నారు.

ఇదే తీరుగా సొంత రాష్ట్రం కేరళ లోనూ పెట్టుబడులను పెంచే కార్యక్రమాన్ని చేపట్టగలిగే శక్తి ప్రతి ఒక్క మలయాళీ లోనూ ఉందని కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. కేరళ రాష్ట్రంలో పెట్టుబడులకు దోహదం చేయడంలో టైకాన్ కేరళ ప్రతినిధులు నిర్వాహకులుగా చేసిన శ్రమకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు.