శ్రీనగర్ కాలనీలో జరిగిన తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. టీఆర్ఎఫ్ మాదిరిగానే టీఆర్ఎస్ పెట్టే వరకు కూడా తెలంగాణ శక్తి ఎవరికీ తెలియలేదు. భూమి కోసం తెలంగాణలో జరిగిన పోరాటాలు ఇక్కడి బిడ్డలందరికీ తెలుసు. ఎన్నో భూ ఉద్యమాలకు తెలంగాణ కేంద్రంగా ఉంది. ప్రతి ఒక్కరి జీవితం భూమి చుట్టూ తిరుగుతోంది అని అన్నారు.
భూమి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కనుకే దానికోసం ఎన్నో పంచాయితీలు జరుగుతాయి. టీఆర్ఎస్ పార్టీకి మొదట్లో రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతంలో పట్టు దొరకలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే భూముల ధరలు తగ్గుతాయని చాలా ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే భూముల విలువ పెరుగుతదంటే ఎవరు నమ్మలేదు. అసలు రాష్ట్రాన్ని నడిపే సమర్థత మీకు ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు అని గుర్తు చేశారు.
హిందూ, ముస్లిం పంచాయితీ, నక్సలిజం, భూముల ధరలు పడిపోతాయంటూ ప్రచారాలు చేశారు. కానీ తెలంగాణ ఏర్పడిన వెంటనే కేసీఆర్ గారు పొట్టి కూటి కోసం వచ్చిన వాళ్లతో మాకు పంచాయితీ లేదన్నారు. అభివృద్ధే మా మతం, సంక్షేమమే మా కులం అంటూ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు అని అన్నారు.
గతంలో బంగారం గానీ బ్యాంకుల్లో గానీ డిపాజిట్ చేసేవారు. కానీ గత 20 ఏళ్లుగా మాత్రం మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లు భూమి మీద పెట్టుబడి పెట్టారు. అలాంటిది తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో భూముల ధరలు ఢమాల్ అంటాయంటూ అనుమానంతో వాళ్లు ఉండేవారు. అందుకే తెలంగాణ ఏర్పాటుకు వాళ్లు భయపడ్డారు అని తెలిపారు.
అదే విధంగా తెలంగాణలో భూములకు గతంలో నీళ్లు ఉండే పరిస్థితి లేదు. మా తాతకు కూడా వందల ఎకరాలు ఉండేది. కానీ నీళ్లు లేకపోవటంతో దానికి ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఎంత పెద్ద భూస్వామి అయినప్పటికీ భూమికి విలువ లేకపోవటంతో బంగారం కుదవ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ గారు ఇవ్వన్నీ దగ్గరుండి గమనించారు. నీళ్లు లేకపోవటంతోనే భూములకు విలువ లేదని గ్రహించారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన సరే ఎకరానికి రూ. 15 లక్షలు అయ్యింది అని పేర్కొన్నారు.
భూమి విలువ పెరిగితే భూమి ఉన్న యాజమానికి ఎంతో భరోసా ఉంటుంది. రైతుబంధు వచ్చి, సాగు నీళ్లు వచ్చి, 24 గంటల కరెంట్ వచ్చి ఇవ్వాళ ప్రతి రైతు ఎంతో భరోసా ఉన్నాడు. మరి దానికి కారణం కేసీఆర్ గారే అని అన్నారు.
కాంగ్రెస్ మార్పు, మార్పు అని ప్రచారం చేసింది. మరీ మార్పు ఎలా ఉంది? తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ను మీరు నాశనం చేస్తారంట కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. తెలంగాణ రాకముందు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేస్ ఉండేవి. రైతులు అర్థరాత్రి వెళ్లి పొలానికి నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ కేసీఆర్ గారు మొత్తం పరిస్థితిని మార్చేశారు. నీళ్లు, కరెంట్ సమస్యను తీర్చేశారు అని గుర్తు చేశారు.
తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే జరగలేదు. సమగ్ర, సమీకృత అభివృద్ధిని కేసీఆర్ గారు చేశారు. అందుకే తెలంగాణలో ఎక్కడ చూసిన ఒక్క ఎకరం రూ. 15 లక్షలు ఉంది. మా ప్రత్యర్థులు మాత్రం డెవలప్మెంట్ ఆటో పైలట్ మోడ్‌లో ఉంది అని అంటారు. మరీ ఈ ఏడాది ఎందుకు డెవలప్మెంట్ జరగటం లేదు. మంచిగా చేసిన కరెంట్‌ను కూడా నాశనం చేశారు. ఏ రైతును కదలించిన బాధపడుతున్నారు. మేము కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని చెబుతున్నారు. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో వాళ్ల పార్టీ నాయకులే కాంగ్రెస్ చేసిన మోసాలను చెబుతున్నారు అని విమర్శించారు.
ఇప్పుడు బిల్డర్లు కనీసం పర్మిషన్లు కూడా తీసుకోవటం కష్టమైపోతోంది. ఇటీవల ఒక పెద్ద బిల్డర్ వచ్చి మరో ఏడాదిలో పరిస్థితి మారకపోతే ఎంతో మంది చిన్న బిల్డర్లు చితికిపోతారని చెప్పారు. శక్తికి మించిన పెట్టుబడులు పెట్టాం. కానీ మా భూములు అమ్ముడు పోవటం లేదని బాధపడ్డారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోంది అని కేటీఆర్ దుయ్యబట్టారు.
రియల్ ఎస్టేట్ రంగం గురించి నా కన్నా ఎక్కువ ఎవరికీ తెలుసు అని ముఖ్యమంత్రి అన్నాడు. మంత్రి పదవి గురించి అడిగితే గుంపు మేస్త్రి మాదిరిగా పనిచేస్తా అన్నాడు. మరి 11 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్‌కు సంబంధించి ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదు అని ఆరోపించారు.
హైడ్రా అనే పేరుతో ఆలోచన లేకుండా చేస్తున్నారు. కేవలం బ్లాక్మెయిల్ దందా కోసం దాన్ని పెట్టారు. ప్రాజెక్ట్‌కు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటే భయపడుతున్నారు. పర్మిషన్ కావాలంటే అది గాలిలో దీపం మాదిరిగా అయ్యింది. ప్రాజెక్ట్‌లు రద్దు చేస్తున్నాడు, కొత్త ప్రాజెక్టులు లేవు, బిల్డర్లను బెదిరించి డబ్బులు కావాలని అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పంపించాలి అని మండిపడ్డారు.
మార్కెట్లో ఎవరి దగ్గరడబ్బులు లేని పరిస్థితిని తీసుకొచ్చారు. నేను చెప్పేవన్ని నిజాలు అని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. మా మీద కోపంతో వేల మంది కడుపులు కొట్టొద్దు. మంచి పనులు చేయండి. రైతుబంధు వేస్తే మళ్లీ ఆ డబ్బు ప్రభుత్వానికే ట్యాక్స్ రూపంలో వస్తుంది. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని అన్నారు.. కానీ ఇప్పుడు ముక్కు పిండి మరీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు తెలియాలి. హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో నష్టం చేస్తుంది. ఎఫ్టీఎల్ లాంటి ప్లేస్‌లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వంలో ఒక చేయి ఏం చేస్తుందో మరో చేయికి తెలియదు. అందుకే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలుసుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని అన్నారు.
మేము మీకు సంబంధించి శాసనసభలో ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. హైడ్రా పేరుతో ఆనాలోచితంగా కూల్చివేయటంతో ఓ గర్భిణీ మహిళ 40 ఏళ్లు ఈఎంఐ ఎలా కట్టాలని ప్రశ్నించింది. మరి దీనికి హైడ్రానా, మున్సిపల్ శాఖనా? ముఖ్యమంత్రా? ఎవరు సమాధానం చెబుతారు అని కేటీఆర్ అడిగారు.
రెరాతో మాట్లాడుతూ లీగల్ ఒపీనియన్ తీసుకొని తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ మరింత బలపడాలి..మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీఆర్ఎస్ గెలవటం ఖాయమని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయలేదు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయాలని భావించాం అని తెలిపారు.
ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకొని ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తాం. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం అని స్పష్టం చేశారు.