మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో పేద ముస్లిం విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోట్ బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్, దేశ తొలి విద్యాశాఖ మంత్రి జయంతి ఉత్సవాలను తెలంగాణలో భవన్‌లో నిర్వహించటం సంతోషంగా ఉంది అని అన్నారు.
2014 లో తెలంగాణ ఏర్పడినప్పుడు హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగుతాయని అనుమానాలు వ్యాప్తి చేశారు. కానీ కేసీఆర్ గారి పదేళ్ల హయంలో గంగా-జమునా తెహ్జీబ్‌ను పాటించటంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచేలా చేశారు. కేసీఆర్ గారు మనిషిని, మనిషిగా మానవత్వంతో చూశారు. కానీ మతపరంగా, ఓట్ల పరంగా చూడలేదు అని తెలిపారు.
అన్ని మతాల వారికి మేలు చేసే విధంగా బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు ఇచ్చారు. అందరినీ కలుపుకొని పోతామని చాలా మంది చెబుతారు. కానీ కేసీఆర్ గారు చేసి చూపించారు. మన పిల్లలకు ఎంత మంచి విద్యను అందిస్తే రాష్ట్రం భవిష్యత్ అంత బాగుంటుందని కేసీఆర్ గారు నమ్మారు అని పేర్కొన్నారు.
200 లకు పైగా రెసిడెన్షియల్ స్కూళ్లను కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. దాదాపు లక్షా 40 వేల మంది విద్యార్థులపై ఏటా రూ. లక్షా 20 వేల ఖర్చు చేశారు. మైనార్టీలకు మంచి విద్యాను అందించేందుకు కేసీఆర్ గారు ఎంతో చిత్తశుద్ధితో పనిచేశారు. మైనార్టీ గురుకుల స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్మాత్మక విద్యాసంస్థల్లో చదువుతూ రాష్ట్రం గర్వపడేలా చేస్తున్నారు. అది ఎంతో సంతోషానిస్తోంది అని అన్నారు.
మౌలానా అబుల్ కలాం గారి పేరుతో 2,751 మంది మైనార్టీ విద్యార్థులకు రూ. 20 లక్షలు రూపాయలు ఇవ్వటం జరిగింది. దాదాపు రూ. 438 కోట్లు ఖర్చు చేశారు. నాంపల్లిలో 100 కోట్ల రూపాయల విలువ గల 2 ఎకరాలు భూమి కేటాయించి రూ. 40 కోట్లతో అనీస్ అల్ గుర్బాను నిర్మించారు. మక్కా మసీదు మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు ఖర్చు చేశారు. ఇస్లామిక్ సెంటర్ కోసం రూ. 40 కోట్లతో సెంటర్‌ను కోకాపేటలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. రూ. 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం కోసం దేశంలోనే ఎవరు ఖర్చు చేయని విధంగా కేసీఆర్ గారు చేశారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడపిల్లల పెళ్లికి రూ. లక్ష ఇచ్చారు. ఇమామ్, మౌలానాలకు రూ. 5 వేలు నెలకు ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మైనార్టీని డిప్యూటీ సీఎంగా చేశారు. హైదరాబాద్‌లో డిప్యూటీ మేయర్ పదవిని కూడా ముస్లింలకు ఇచ్చింది. అందరినీ కలుపుకొని వెళ్లే ఉద్దేశంతో అన్ని వర్గాలకు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. కానీ వాటిని ఎక్కడ ప్రచారం చేసుకోలేదు అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్రేమ దుకాణం అంటూ మాట్లాడారు. కానీ అన్ని విద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు వదిలేశారు. మొత్తం అన్ని వర్గాలను పట్టించుకోవటం మానేశారు. ఇప్పుడు ఒక్క మూసీ పేరుతో 16 వేల పేదల ఇళ్లను కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గరీబులు, పేదల కోసం చిత్తశుద్ధితో మంచి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని కొనియాడారు.
మైనార్టీ డిక్లరేషన్ పేరుతో వాళ్లు చాలా హామీలు ఇచ్చారు. ఆరు నెలల్లో మైనార్టీ జన గణన అన్నారు. జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో, రిజర్వేషన్లలో అవకాశాలు కల్పిస్తామన్నారు. మైనార్టీ సబ్ ప్లాన్ అన్నారు. రూ. 4 వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తా అన్నారు. ఏం చేస్తారో చూద్దాం. వెయ్యి కోట్లతో మైనార్టీల ఉపాధికి లోన్లు ఇస్తామన్నారు. కానీ రూ. లక్ష కూడా ఇవ్వలేదు అని విమర్శించారు.
మౌలానా ఆజాద్ పేరుతో తోఫా ఏ తలీమ్ అన్నారు. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. పీహెచ్డీ, పీజీ చేసిన వాళ్లకు రూ. 5 లక్షలు అన్నారు. కానీ ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు.ఇమామ్‌లు, మౌలనాలకు రూ. 12 వేలు ఇస్తామంటూ వాగ్దానం చేశారు. ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలు, అదే విధంగా ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారు. షాదీ ముబారక్ పేరుతో రూ. లక్షా 5 వేలు, అదే విధంగా తులం బంగారం ఇస్తా అన్నారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాగ్దానాలు చేసి మీ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కారు అని దుయ్యబట్టారు.
మెహబ్బత్ దుకాణం అన్నారు. కానీ ఇప్పుడు విద్వేషాల రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ గారి హయాంలో ఒక్క గంట కూడా కర్ఫ్యూ విధించాల్సి పరిస్థితి లేకుండా పరిపాలన చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఈ దసరా, దీపావళి సందర్భంగా ఒక నెల మొత్తం ఇప్పుడు కర్ఫ్యూ విధించారు. అందుకే కేసీఆర్ ఎక్కడ. ఈ చిచోరా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
వరంగల్‌కు వెళితే అక్కడ ప్రజలు ఇంకా నాలుగేళ్లు ఈ ప్రభుత్వాన్ని భరించాలా అని బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం వద్దు అని వాళ్లను పడగొట్టేందుకు ఇంకే మార్గం లేదా అన్నారు. కానీ ఒక్కసారి ఓటు వేస్తే ఐదేళ్లు వాళ్లను భరించాల్సిందే. దాదాపు 60 ఏళ్లు అవకాశం ఇచ్చినప్పటికీ వాళ్లు ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూడొచ్చు అని అన్నారు.
అందరి సంక్షేమం కోసం పనిచేసిన కేసీఆర్ గారికి తప్పకుండా మీరు మళ్లీ అవకాశం ఇస్తారని నమ్మకం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.