mt_logo

ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లు నింపాలి: కేటీఆర్

బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి కరీంనగర్‌లో లోయర్ మానేరు డ్యాంని సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏటా వృథాగా పోతున్న వందల టీఎంసీల నీళ్లను ఒడిసి పట్టేందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగానే దేశానికే తెలంగాణ ధాన్య భండాగారంగా మారింది అని తెలిపారు.

పంజాబ్, హర్యానాను తలదన్ని నీటి సమృద్ధిని సాధించటంతో వ్యవసాయ విస్తరణ జరిగింది. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్ధంలో చూపి కాళేశ్వరంను విఫల ప్రాజెక్ట్ అని చూపే ప్రయత్నం చేశారు. ఎనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లక్షలాది మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది అని దుయ్యబట్టారు.

సరిగ్గా గతేడాది ఇదే రోజు ఎల్ఎండీలో 12 టీఎంసీలకు పైగా నీళ్లు ఉండే. పంపింగ్‌కు సరైన సమయంలో చేసి ఎల్ఎండీ పూర్తి కెపాసిటీని నింపి రైతులకు భరోసా ఇచ్చాం. ఈ ఏడాది 45 శాతం వర్షపాతం తక్కువ నమోదైంది. కానీ ఇప్పటి వరకు పంపింగ్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృథా పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అని మండిపడ్డారు.

అందుకే నీటి పంపింగ్‌పై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరాం. ఎండిపోతున్న ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని కోరుతున్నాం. రాజకీయపరమైన కక్షతో మీరు పంపింగ్ స్టార్ట్ చేయకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అని కేటీఆర్ అన్నారు.

ఈ ప్రభుత్వం వర్షం తక్కువ పడిందంటూ, వర్షాలు లేవంటూ సాకులు చెప్పి రైతులకు, ప్రజలకు నష్టం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కన్నెపల్లి దగ్గర పంప్ ఆన్ చేస్తే మొత్తం రిజర్వాయర్లు నిండుతాయి. మొత్తం రిజర్వాయర్లలో 140 టీఎంసీలకు గాను 35 టీఎంసీలు కూడా నిండి లేదు. మేడిగడ్డ నుంచి పెద్ద ఎత్తున నీటిని పంపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది అని పేర్కొన్నారు.

మల్లన్న సాగర్‌లో 50 టీఎంసీలు, కొండ పోచమ్మ సాగర్‌లో 15 టీఎంసీలు నింపితే ప్రజలకు మంచి నీటిని ఇబ్బందులు కూడా ఉండవు. కానీ ఇవన్నీ పక్కన బెట్టి కేసీఆర్ గారి బద్నాం చేసే కుట్ర చేస్తున్నారు. మేడిగడ్డ ఏదో కొట్టుకుపోతుందని, లక్షల కోట్లు నీటి పాలు అయ్యాయంటూ 8 నెలలుగా మీరు చేసిన ప్రచారం వట్టిదేనని తేలిపోయింది అని విమర్శించారు.

ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల పరిస్థితిని ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాం. నీటి పంపింగ్ ఎందుకు చేయటం లేదంటూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పది లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని మేడిగడ్డ ఠీవిగా నిలబడింది అని అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలతో చెలగామటం ఆడవద్దని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నా.. వాతావారణం అనుకూలిస్తే అన్ని బ్యారేజ్‌లను సందర్శిస్తాం. ఎండుతున్న రిజర్వాయర్లు, రైతుల వెతలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు మీడియా కూడా ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.