mt_logo

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోంది: బీఆర్ఎస్ నేత క్రిశాంక్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోంది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో క్రిశాంక్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులు డమ్మీలుగా మారారు అని పేర్కొన్నారు.

హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారు. ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్‌కు అనుమతి ఇచ్చారు. పొన్నం ప్రభాకర్‌కు తెలియకుండానే ఆర్టీసీలో ఈ టిక్కెట్ మిషన్లు కొనుగోలు చేశారని మంత్రి అంటున్నారు అని విమర్శించారు.

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది.. టెండర్లు లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టును కంపెనీలకు అప్పగిస్తున్నారు. ఆర్టీసీ ఈ టిక్కెట్ కాంట్రాక్టు విషయంపై సమాచారం అడిగితే మా పరిధిలోకి రాదని ఎండీ సమాధానం చెప్తున్నారు అని అన్నారు.

ఆర్టీసీ ఈ టిక్కెట్ మిషన్ల కాంట్రాక్టుపై పొన్నం ప్రభాకర్‌కు సంబంధం లేదని అంటున్నారు. ప్రతి రోజు 30 నుంచి 50 లక్షల టిక్కెట్ల కమీషన్ కంపెనీకి వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఫేక్ ప్రభుత్వం నడుపుతోంది అని క్రిశాంక్ దుయ్యబట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం.. నేషనల్ స్టాక్ ఎక్చేంజికి మేము ఫిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ పాలనపై ఇప్పటికే బీఆర్ఎస్ బ్లాక్ బుక్, రెడ్ బుక్, గ్రీన్ బుక్స్ రెడీ చేసింది అని తెలిపారు.