mt_logo

హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్నికించ పరిచిన వారికి ఇది చెంప చెళ్లుమనిపించే చర్య : సీఎం కేసీఆర్‌ 

ప్రభుత్వ వేలంలో హైదరాబాద్‌ భూములు ఎకరాకు రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి, ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్ధిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని అన్నారు. ‘ఇంతింతై వటుడింతై..’ అన్నట్టుగా హైదరాబాద్‌ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని తెలిపారు.

తెలంగాణ వస్తే హైదరాబాద్‌ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని భయభ్రాంతులకు గురి చేసి, హైదరాబాద్‌ ఆత్మగౌరవాన్ని కించ పరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా ఈ భూముల ధరల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలని స్పష్టంచేశారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా దృఢ చిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్‌ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న హెచ్‌ఎండీఏ అధికారులను, మంత్రి కేటీఆర్‌ను, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు.