తోటి మనిషి బాగును కోరుకోవడమే కాళోజీకి మనమందించే ఘన నివాళి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని, గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ సమాజం కోసం వారు పడిన తపన, వారందించిన పోరాట స్ఫూర్తి, మలిదశ ఉద్యమంలో అనంతర బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఇమిడివున్నదని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాళోజీ కృషిని, స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించటానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
తోటి మనిషి క్షేమాన్ని కోరుకోవడం, సబ్బండ వర్గాల అభ్యున్నతకి చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కాళోజీకి మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ అన్నారు.