mt_logo

మన ప్రభుత్వాన్ని పోగొట్టుకుని ఊర్లల్ల బాధపడుతున్నారు: కేసీఆర్‌తో కార్యకర్తల ఆవేదన

అన్ని వర్గాలను కడుపులోపెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేస్తున్న కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవడానికి పలు ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలు అభిమానులు అభిప్రాయపడ్డారు.

ప్రతిరోజూ మాదిరి గురువారం నాడు కూడా కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల నుండి తనను కలిసేందుకు వచ్చిన వారితో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వారినుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే దేశానికి ఆదర్శంగా పాలన నందించిందని అన్నారు. విద్యుత్, సాగునీరు, తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా కొనసాగిందన్నారు.

తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాలన కావాలని కోరుకున్నారని తెలిపారు.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్ ‘ అనే నినాదంతో దేశంలో రైతు రాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్‌తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని తెలిపారు.

నల్ల చట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయ రంగాన్ని ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతియుత పోరాటం చేసిన సంగతిని కేసీఆర్ గుర్తుచేశారు. రైతుల మీద లాఠీఛార్జీ కాల్పులు జరిపి ఏడువందల మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందన్నారు.

దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుండి ఒక లైన్ తీసుకొని ముందుకు సాగిందని కేసీఆర్ వివరించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రజల అపూర్వస్పందన కానవచ్చిందన్నారు. తెలంగాణతో పాటు దేశ రైతాంగ ప్రగతికోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరిచిందని తెలిపారు.

అయినా ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదు. మనకు ప్రజా తీర్పే శిరోధార్యం. వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలి. అధికారం కోల్పోయామని బాధపడడం సరియైన రాజకీయ నాయకుని లక్షణం కాదు. ప్రజాసంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం. దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదు. ప్రజల్లో కలిసివుంటూ వారి సమస్యలమీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని కేసీఆర్ పునరుద్ఘటించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగునీరు తాగునీరు నిరంతర విద్యుత్ ఫీజు రీ అంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడం తో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని కేసీఆర్ అవేదన వ్యక్తం చేశారు.

రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమలక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.

తనను కలిసేందుకు ముందస్తు సమాచారం లేకుండా రావడం వల్ల మీకూ ఇబ్బందే నాకూ ఇబ్బందేనని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేముందు సమాచారం లేదా అనుమతి తీసుకొని రావాల్సిందిగా తనను కలిసేందుకు ఎర్రవెల్లికి వస్తున్న ప్రజానీకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

నియోజకవర్గాల పేర్లను పార్టీ ముందస్తుగా ప్రకటిస్తుందని.. అట్లా ప్రకటించిన ప్రాంతాల వారే తమ స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ తనను కలవడానికి రావాలని ఒక ప్రత్యేక ప్రకటనలో కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.