నేడు దాశరథి శతజయంతి సందర్భంగా వారందించిన స్ఫూర్తిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన కవిత్వం ద్వారా తెలంగాణ గరిమను ప్రపంచానికి చాటి, తన సాహిత్యం ద్వారా ‘తిమిరంతో సమరం’ చేస్తూ, నాటి రైతాంగంలో రాచరికానికి వ్యతిరేకంగా సాయుధ పోరాట స్పూర్తిని రగిలించిన యోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దాశరథి అని కేసీఆర్ కొనియాడారు.
తెలంగాణ సాధనకోసం తాను సాగించిన పోరాట పంథాలో దాశరథి అందించిన స్పూర్తి ఇమిడి వున్నదని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం, అభ్యుదయ కవి రచయిత, దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సందర్భంగా కేసీఆర్ వారందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.
మహోన్నతమైన దాశరథి గొప్పతనాన్ని గుర్తించి, వారి స్ఫూర్తి కొనసాగే దిశగా, వారి జయంతి రోజున, తెలంగాణ సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులకు ప్రతియేటా అందించేందుకు దాశరథి కృష్ణమాచార్య అవార్డును తమ ప్రభుత్వ హయాంలో నెలకొల్పామని గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని అత్యున్నత శిఖరాల మీద నిలబెట్టే దాశరథి కవిత్వం సాహిత్యం తెలంగాణ భవిష్యత్తు తరాలకు నిత్య స్పూర్తిదాయకమని కేసీఆర్ అన్నారు.