mt_logo

కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అనుమతి కోసం ఈరోజు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కలిశారు.

అనంతరం వాసుదేవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల దృష్ట్యా ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 22 నుండి మే 10వ తేది వరకు జరగబోయే కేసీఆర్ యాత్ర వివరాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లాము. ఎన్నికల సందర్భంగా అధికారులందరూ ఈసీ పరిధిలోకి వస్తారు కాబట్టి యాత్రకు సంబంధించి తగు భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం అని అన్నారు.

యాత్రలో పోలీసు సహకారం అందేలా ఆదేశాలు ఇవ్వాలని.. సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించి వాటిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టాలని.. అవసరమైతే కేంద్ర బలగాలను మొహరించాలని.. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరినట్టు అతను తెలిపారు.

యాత్రలో మా నాయకుడు కేసీఆర్ గారు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఒక భరోసాను ఇస్తారని.. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు, పేరుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టిన ఎక్కడ కొనట్లేదు. రోజుల తరబడి రైతులు వేచి చూస్తున్నారు అని పేర్కొన్నారు.

రైతులకు పండించిన పంటలకు ఎంఎస్పీకే కొనాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మాటాలు ఒట్టి మాటలే అయ్యాయి.. అగ్గువ ధరకే రైతులు ధాన్యాన్ని అమ్ముతున్నారు. ఇస్తానన్న రూ. 500 బొనస్ లేదు. అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ 4 నెలల కాలంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు నష్టమే అని అన్నారు. ప్రజల పక్షాన నిలబడే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే లోకసభ ఎన్నికల్లో గెలిపించాలని వాసుదేవరెడ్డి కోరారు.