mt_logo

ఏప్రిల్ 18న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫాంలు.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర

తెలంగాణ భవన్‌లో ఈనెల 18వ తేదీన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులకు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫాంలు అందజేయనున్నారు. అదే సందర్భంగా.. ఎన్నికల ఖర్చుల నిమిత్తం.. ఎన్నికల నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు.

ఈ మేరకు అదే రోజు జరిగే సుధీర్ఘ సమీక్షా సమావేశంలో ఎన్నికల ప్రచారం, తదితర వ్యూహాలకు సంబంధించి అధినేత సమగ్రంగా చర్చించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్యులు పాల్గొంటారు.

అదే విధంగా.. తెలంగాణ ప్రజలకు మరింత చేరుకావాలని కేసీఆర్ నిర్ణయించారు. కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.

ఏప్రిల్ 18వ తేదీ నాడు జరగనున్న పార్టీ సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.