mt_logo

ఒక పద్దు లేదు.. పద్ధతి లేదు.. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్: కేసీఆర్

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం నాడు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం అనంతరం సహచర ఎమ్మెల్యేలతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది అని దుయ్యబట్టారు. రైతుభరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు.. ప్రజల గొంతు కోసింది ప్రభుత్వం.. దళితబంధు పథకం ప్రస్తావనే లేదు.. దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారు అని విమర్శించారు.

ఒత్తి పలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదు.. రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారు. బడ్జెట్ ఒట్టి డొల్ల.. ఈ అర్భక ప్రభుత్వం ఒక్క పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదు అని అన్నారు.

ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది.. రైతులను ప్రభుత్వం వంచించింది. కథ చెప్పారు తప్ప.. బడ్జెట్ పెట్టినట్టు అనిపించలేడు. బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్ అని ధ్వజమెత్తారు.

పేదల కోసం ఒక్క పాలసీ అయినా ప్రకటించారా? బడ్జెట్‌లో ఒక పద్దు.. పద్ధతి లేదు. బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం.. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని కేసీఆర్ మండిపడ్డారు.

భట్టి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ సరిగా లేదు. యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదు.. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చాం అని అన్నారు.

ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైంది.. ఐటీ, పారిశ్రామిక పాలసీ ఏది.. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదు అని కేటీఆర్ అన్నారు.