తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారు అని అన్నారు.
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుంది. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది. అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ. అలాంటి బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే తెలంగాణ సమాజంలో స్నేహశీలత, సుహృధ్భావం ఎలా కనిపిస్తుంది? అని ప్రశ్నించారు.
మన అస్తిత్వాన్ని దెబ్బతీసే ధైర్యం ఎవరికి లేదు. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఉనికి, సంస్కృతిపై దాడి జరుగుతుంటే మాట్లాడకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంపై రేవంత్ రెడ్డి ఎక్కడా లేరు అని పేర్కొన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణ సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారు. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై తుపాకి ఎక్కిపెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఉద్యమ సమయంలో నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం. ఒక చేతిలో జొన్నకర్ర, మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు, కవితలు రచించి పుస్తకాలు వెలువరిస్తాం. పిల్లలు వాడే నోట్ బుక్స్, రైటింగ్ ప్యాడ్స్ అన్నింటిపై తెలంగాణ తల్లిని ముద్రించి పిల్లలకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం అని కవిత తెలిపారు.
తెలంగాణ తల్లికి ఆరాధానతో కార్యక్రము మొదలుపెట్టే సంప్రదాయాన్ని ఇకముందూ కొనసాగిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహాలను గ్రామ గ్రామానా ప్రతిష్టించే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రూపొందించిన విగ్రహానికి కాంగ్రెస్ మాతగా నామకరణం చేస్తూ తీర్మానం చేస్తున్నామని అని అన్నారు.
మహిళలు జరుపుకునే బతుకమ్మను ముఖ్యమంత్రి అవమానించిన విషయం తెలిసిందా లేదా ? లేదంటే మీ సమ్మితితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నారా అన్నది తెలంగాణ సమాజానికి చెప్పాలని సోనియా గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
ప్రియాంకా గాంధీ కేరళ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు కాబట్టి అక్కడి చీర కట్టుకొని పార్లమెంటులో మాట్లాడారని, మరి తెలంగాణ సీఎం బతుకమ్మను అవమానం చేస్తూ తెలంగాణ తల్లి చేతుల్లోని బతుకమ్మను మాయం చేశారని, దీనికి మద్ధతిస్తున్నారా అని ప్రియాంకా గాంధీని ప్రశ్నించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వచ్చి గ్యారెంటీ కార్డులపై సంతకాలు చేసి తెలంగాణ ప్రజలను గౌరవిస్తామని చెబితే ప్రజలు నమ్మి కాంగ్రెస్ కు ఓట్లు వేశారని అన్నారు.
బీసీ వర్గాలకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా బహుజనులను కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నడూ జై తెలంగాణ అని అనని వ్యక్తి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ లేదని, ఆయన ఉద్యమంలో లేరు కాబట్టి తెలంగాణ హృదయం అర్థమవ్వడం లేదని పేర్కొన్నారు.