బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ఆస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని తేల్చిచెప్పారు.
తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతిక అని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉన్నదని అడిగారు.
ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్క తెలంగాణవాది ఖండిస్తున్నారని తెలిపారు.
తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే కానీ అందులో మహిళలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కవులు, కళాకారులను గుర్తించడంలో ఆడబిడ్డలు ఎక్కడ? అని ప్రశ్నించారు. “విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి మీకు గుర్తుకు లేదా? మహిళలకు ఏమో విగ్రహాలు.. పురుషులకేమో వరాలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి ఇక మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వరా?” అని నిలదీశారు.
తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని ముఖ్యమంత్రి అంటున్నారని, అంటే తెలంగాణలో కూలినాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలు గానే ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమా అని ప్రశ్నించారు. వాళ్లు గొప్ప వాళ్ళు కావాలని అనుకోకూడదా అని అడిగారు.
కాగా, “అమ్మను చూస్తే ఒక స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. అలా స్ఫూర్తిదాయకంగా మన సంప్రదాయానికి ప్రతీక అయినా బతుకమ్మను చేతిలో పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం వల్ల ప్రజల మనసులు నొచ్చుకున్నాయి. తన ప్రసంగంలో ఒక్క సామాన్య మహిళల పేరు కూడా తీయని సీఎంను మేము ఎలా నమ్మాలి? అని అడిగారు. సచివాలయంలో పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు.
ఉద్యమకారులను అవమానించవద్దని సూచించారు. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న ఎవ్వరు కూడా బాగుపడలేదని హెచ్చరించారు. “ఆ విషయం నీ గురువు చంద్రబాబు నాయుడుకు తెలుసు. ఆయన దగ్గర నుంచి నేర్చుకో” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు.
ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని అన్నారు. ఒకపక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆశా వర్కర్ల మీద దాష్టకం చేశారని ధ్వజమెత్తారు.