తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బంజారాహిల్స్ ఏసీపీకి పొద్దునే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ కూడా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తే మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు అని అన్నారు.
నేను ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారు. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి తెలియదా? ఏ ప్రజాప్రతినిధి కానీ సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారు అని దుయ్యబట్టారు.
చివరకు బంజారాహిల్స్ సీఐకు నా ఫిర్యాదు ఇచ్చి రసీదు తీసుకున్నా. నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనేది నా ప్రధాన ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నేను ఓ మిత్రుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి పోలీసులను పంపించారు. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, శివధర్ రెడ్డిపై కేసు బుక్ చేయాల్సిందే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.
మా నేత హరీష్ రావుపై బ్రోకర్ రేవంత్ రెడ్డి సూచనతో బ్రోతల్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. బ్రోకర్, బ్రోతల్‌లు కేసు పెడితే పోలీసులు హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు. హరీష్ రావు పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నా కేసు విషయంలో సీఎం రేవంత్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అని అన్నారు.
నేనిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. మా అగ్రనేతలందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చింది. సీఎం పాపాల నుంచి ప్రజలను దేవుళ్ళే కాపాడాలి. వచ్చేది మా ప్రభుత్వమే.. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తప్పవు అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.