అసెంబ్లీ మీడియా హల్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, పది లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చారని ఎవరు నిరూపించినా నేను దేనికైనా సిద్ధం అని సవాల్ విసిరారు.
కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న 2 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చి తీరాలి. ఎన్నికలప్పుడు జాబ్ క్యాలెండర్‌పై రేవంత్, భట్టిల సంతకాలతో భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చారు. నిన్న నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్‌పై వేయి కళ్లతో ఎదురు చూశారు. జాబ్ క్యాలెండర్ పేరిట ఉత్త పత్రాన్ని విడుదల చేసి నిరుద్యోగులను నిరాశపరిచారు.. మేము నిరుద్యోగులపై మాట్లాడుతుంటే సీఎం దానం నాగేందర్‌ను రెచ్చగొట్టి బూతులు మాట్లాడించారు అని విమర్శించారు.
దానం నాగేందర్ హైదరాబాద్‌లో మమ్మల్ని తిరగనివ్వం అంటున్నారు.. దానం ఎక్కడికి రమ్మన్నా వస్తా.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలి అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.