-1266 పోస్టుల అప్‌గ్రేడేషన్..కొత్తగా 33 పోస్టుల మంజూరు
వైద్యారోగ్య శాఖలో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు మానవీయ నిర్ణయం తీసుకొన్నది. ఆ శాఖలో కారుణ్య నియామకాల కోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీపీహెచ్ పరిధిలో 33 పోస్టులను మంజూరు చేయడంతపాటు కారుణ్య నియామకాల కోసం 1,266 పోస్టులను అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పోస్టుల భర్తీతో ఎప్పటినుంచో కారుణ్య నియమకాలకోస ఎదురుచూస్తున్న కుటుంబాలకు భరోసా లభించడంతోపాటు ప్రజారోగ్యం మెరుగుపడుతుందని ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు.
నిజామాబాద్‌లో అధికంగా పోస్టులు
వైద్యారోగ్య శాఖలో కారుణ్య నియామకాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో వెంటనే వీరికి పోస్టింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను సూపర్ న్యూమరరీ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్‌గ్రేడ్ చేసి, వీటిని భర్తీ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలవారీగా జాబితాను కూడా విడుదల చేశారు. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 117 పోస్టులు ఉండగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లో 73 పోస్టులు ఉన్నాయి. సిద్దిపేటలో 64, నాగర్‌కర్నూల్‌లో 59, జగిత్యాల, హనుమకొండలో 58 పోస్టులను భర్తీ చేయన్నారు. ఇక డీపీహెచ్ పరిధిలో కొత్తగా మంజూరైన పోస్టుల్లో అడిషనల్ డైరెక్టర్ (అడ్మిన్) – 1, జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) – 1, డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) – 1 ,అసిస్టెంట్ డైరెక్టర్, (అడ్మిన్- స్టేట్ క్యాడర్) – 3, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్టేట్ క్యాడర్) – 4, ఆఫీస్ సూపరింటెండెంట్ – 6, సీనియర్ అసిస్టెంట్ – 12, డీఎంహెచ్‌వో – 5 పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే భర్తీ చేసి, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకొంటున్నది.