mt_logo

మేము బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటాం: రేవంత్ రెడ్డి ట్వీట్‌పై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత

ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ, పీసీసీ  అధ్యక్షుడు రాజకీయం చేయడంపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. X లో రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కల్వకుంట్ల కవిత  తిప్పి కొట్టింది. బతుకమ్మను కించపరచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.  ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం… ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు. 

మేము బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని మండి పడ్డారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా ? అని ప్రశ్నించారు. 

నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.  తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా ? అని అడిగారు.  కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి  లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని తెలిపారు.  చివరికి గ్రూప్ 2 ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా X లో డిమాండ్ చేయలేదా ? అనడిగారు. 

శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు.  హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి అన్నారు.  రేవంత్ ఆవేదన బూటకం…కాంగ్రెస్ ఆందోళన నాటకమని పేర్కొన్నారు.