mt_logo

వర్షం సుక్క లేకున్నా.. అన్నదాతకు బాసటగా.. కాళేశ్వరం జలాలు

  • బాల్కొండ నియోజకవర్గ రైతులకు ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు
  • ప్యాకేజీ 21 ద్వారా వచ్చిన నీటితో పెద్దవాగు,కప్పల వాగు ఇప్పుడు సజీవంగా ఉంటాయి
  • పైప్ లైన్ ద్వారా ప్రతి మూడు ఎకరాలకు ఒక సాగునీటి ఔట్ లెట్

భీంగల్: ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను ప్యాకేజీ 21 పైప్ లైన్ ద్వారా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం నాడు భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామం వద్ద కప్పల వాగులో విడుదల చేశారు. నీటిని విడుదల చేసిన అనంతరం మంత్రి రైతులు,పార్టీ శ్రేణులతో కలిసి నీటిలో దిగి సంబురాలు చేసుకున్నారు. నీటిని చూస్తూ మురిసిపోయిన మంత్రి వేముల,తన జన్మ ధన్యమైపోయిందని సంబుర పడ్డారు. అభిమానులు మంత్రిని కప్పల వాగు నీటిలో తమ భుజాల మీద మోసుకుంటూ “జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న అంటూ” తమదైన శైలిలో మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు,ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రిని శాలువాలతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ చూడని అపూర్వ ఘట్టమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

వర్షాలు లేకున్నా అన్నదాతకు బాసటగా నిలవడం ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమయ్యిందని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలు రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ నుంచి ఎస్సారెస్పీ లోకి చేరుకొని అక్కడి నుండి సారంగాపూర్, మెట్రాజ్ పల్లి పంప్ హౌజ్ ప్యాకేజీ 20,21 ద్వారా నేడు పెద్ద వాగు, కప్పల వాగులోకి చేరుకున్నాయని తెలిపారు. వాగులోకి ఎదురెక్కి వస్తున్న కాళేశ్వర జలాలు చూస్తుంటే మనసు పులకించి పోతుందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గ రైతులకు ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని అన్నారు.ప్యాకేజీ 21 ద్వారా వచ్చిన నీటితో పెద్దవాగు,కప్పల వాగు ఎప్పుడు సజీవంగా ఉంటాయన్నారు. రైతులకు పైప్ లైన్ ద్వారా ప్రతి మూడు ఎకరాలకు ఒక సాగునీటి ఔట్ లెట్ ఏర్పాటు చేసి.. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు అందించినట్లు..పొలాల్లోకి వాల్వు ద్వారా సాగునీరు అందివ్వనున్నట్లు తెలిపారు. ఒక సీజన్లో పంటలు వేయకుండా  రైతులు పైప్ లైన్ వేయడం కోసం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. బాల్కొండ నియోజకవర్గ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు మంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఎస్సారెస్పీ వాటర్ అందని బాల్కొండ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లోని గ్రామాలు ప్యాకేజీ 21 ద్వారా సస్యశ్యామలం కానున్నాయని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.