mt_logo

ఆదినుంచీ అదే వివ‌క్షే.. పీఎం మిత్ర‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ద‌క్క‌ని ప్రాధాన్యం!

అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంపై నాటినుంచీ కేంద్రం వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్న‌ది. విభ‌జ‌న హామీల్లో ఏ ఒక్క‌దాన్ని నెర‌వేర్చ‌కుండా మోసం చేస్తూనే ఉన్న‌ది. ప్ర‌పంచ‌మే అబ్బుర‌ప‌డేలా కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్టుకొంటే జాతీయ హోదా ఇవ్వ‌కుండా ధోకా ఇస్తూనే ఉన్న‌ది. ఐటీలో దూసుకుపోతున్న తెలంగాణ‌కు ఒక్క సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీ పార్కు కేటాయించ‌కుండా మొండిచెయ్యి చూపింది. ఎంతోమందికి కొలువులు తెచ్చే ఐటీఐఆర్‌నూ ర‌ద్దు చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఊసే ఎత్త‌డం లేదు. ఇలా.. అన్ని రంగాల్లోనూ తెలంగాణ‌పై తీవ్ర క‌క్ష‌ చూపుతున్న కేంద్రంలోని మోదీ స‌ర్కారు తాజాగా, తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏర్పాటు చేసిన కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కు (కేఎంటీపీ)పైనా త‌న వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించింది. వ‌స్త్రాల తయారీలో భారత్‌ను గ్లోబల్‌హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన‌ ‘పీఎం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్స్‌ అండ్‌ అప్పారెల్‌’ (పీఎం మిత్ర) పథకంలో కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు అన్ని అర్హ‌త‌లు ఉన్నా ప్రాధాన్యం ఇవ్వ‌కుండా త‌క్కువ నిధులు ఇచ్చి చేతులు దులుపుకొన్న‌ది. 

వ‌స్త్రాల త‌యారీలో ముందుండ‌డ‌మే తెలంగాణకు శాప‌మా?

వ‌స్త్రాల తయారీలో భారత్‌ను గ్లోబల్‌హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో 2020-21లో కేంద్ర స‌ర్కారు  ‘పీఎం మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్స్‌ అండ్‌ అప్పారెల్‌’ (పీఎం మిత్ర) ప‌థ‌కాన్ని తీసుకొచ్చింది. అయితే, తెలంగాణ స‌ర్కారు ఈ ప‌థ‌కం కంటే ముందే అక్టోబర్‌ 2017లో వరంగల్‌ శాయంపేట వద్ద 1200 ఎకరాల్లో కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టింది. కేంద్రం స‌హ‌కారం లేకున్నా 100 కోట్ల రూపాయలు కేటాయించి, అన్ని మౌలిక స‌దుపాయాల‌తో అత్య‌ద్భుతంగా అభివృద్ధి చేసింది. ఈ పార్కుకు సహ‌కారం అందించాల‌ని కేంద్ర స‌ర్కారును సాక్షాత్తు సీఎం కేసీఆర్ వేడుకొన్నా.. అక్క‌డినుంచి రిక్త‌హ‌స్త‌మే ఎదురైంది. తాజాగా, పీఎం మిత్ర పథకంలో భాగంగానైనా కేఎంటీపీకి భారీగా నిధులు వ‌స్తాయ‌ని ఆశ‌గా చూసిన తెలంగాణ‌కు కేంద్రం మొండిచెయ్యి చూపింది.  గ్రీన్‌ఫీల్డ్‌ పార్క్‌ అర్హతలున్నా బ్రౌన్‌ఫీల్డ్‌ పార్క్‌గా పరిగణిస్తూ తీవ్ర వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిచింది. రూ.500 కోట్ల‌కు బ‌దులుగా రూ.200 కోట్లు మాత్ర‌మే కేటాయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ‌ప‌ట్ల త‌న వివ‌క్ష‌పూరిత ధోర‌ణికి అద్దంప‌ట్టింది. కేంద్రం ఏర్పాటు చేసే ఎస్‌పీవీ పర్యవేక్షణలో అభివృద్ధి చేసిన పార్క్‌లను మాత్రమే గ్రీన్‌ఫీల్డ్‌ పార్క్‌ల జాబితాలో చేరుస్తామని చెబుతున్న కేంద్రం వైఖరి విమర్శలకు తావిస్తున్నది. పీఎం మిత్ర కంటే ముందే తెలంగాణ స‌ర్కారు కేఎంటీపీని ఏర్పాటు చేయ‌డ‌మే శాపంగా మారింద‌ని తెలంగాణ ప్ర‌జ‌లు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు. కేంద్ర స‌ర్కారు కావాల‌నే కొత్త నిబంధ‌న‌లు పెడుతూ తెలంగాణ‌కు నిధులు అడ్డుకొంటున్న‌ద‌ని మేధావులు మండిప‌డుతున్నారు.