mt_logo

బీఆర్ఎస్ లోకి భారీగా చేరిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కీలక నేతలు

హైదరాబాద్, జూన్ 11: 75 యేండ్ల స్వతంత్ర భారత దేశంలో కేంద్రంలోని పాలన ఇంకా లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యం గానే కొనసాగుతున్నదని, దశ దిశ లేని పరిపాలన దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించిందని, ఈ దిశగా చైతన్యమై, పార్టీలను కాకుండా తమ ఆకాంక్షలను గెలిపించుకోవాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర తో పాటు మధ్యప్రదేశ్ నుంచి కూడా చేరికలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ విధానాలు, పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చిన మధ్యప్రదేశ్ సీనియర్ రాజకీయ నేతలు, మేధావి, సామాజిక తదితర వర్గాలు పార్టీలో చేరుతున్నారు. మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్తగా మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ ను అధినేత నియమించడంతో అక్కడ పార్టీ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పటేల్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు సహా మరో రెండువందల మంది కీలక రాజకీయ నేతలు ఆదివారం నాడు అధినేత సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధ్యప్రదేశ్ బీఆర్ఎస్ సమన్వయకర్త మాజీ ఎంపీ బుద్దసేన్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో…చాంద్వాడా జిల్లా, జున్నార్ దేవ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే రామ్ దాస్ యికే సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, భువన్ సింగ్ కోరం, లక్ష్మణ్ మస్కోలే తో పాటు దాదాపు 200 మంది సీనియర్ రాజకీయనాయకులు ప్రజా సంఘాల నేతలు మేధావులు తదితరులు బీఆర్ఎస్ లో చేరారు