హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా లౌకిక ప్రభుత్వాన్ని నడుపుతున్నదని అన్నారు. తెలంగాణ మాదిరిగా దేశంలో మరే రాష్ట్రం లౌకికవిధానంతో కలిసి పాలించటం లేదు. సర్వమత సామరస్యం..సర్వజనహితమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమం నుంచి తొమ్మిదిన్నరేండ్ల పాలన దాకా బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్‌కు ఒక వర్గానికి ప్రతినిధిగా ప్రజలు చూడటంలేదు. అందరివాడిగా స్వీకరించి ఆదరిస్తున్నది తెలంగాణ సమాజం అని తెలిపారు.
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులకు తెలంగాణ కేటాయింపులు, ఖర్చులను పోల్చి చూడండని అన్నారు.. ఏ రాష్ట్రం కూడా తెలంగాణలాగా ముస్లిం సమాజ అభ్యున్నతికి పాటుపడింది లేదని తేల్చి చెప్పారు.
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించినా రైతు ప్రయోజనాలే మాకు ముఖ్యమని, కేంద్రం ఇవ్వకపోయినా ఫర్వాలేదని కేంద్రంతో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం బీజేపీతో ఎందుకు పోరాటం చేస్తుంది? అని అడిగారు. కేంద్రం విధించిన షరతులకు తెలంగాణ ఒప్పుకోకపోవడం వల్లే దేశంలో అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చాం.. తెలంగాణ ఒప్పుకోలేదు కాబట్టే నిధులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ ఎందుకు చెప్తారు? అని అడిగారు.
కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ముస్లిం సమాజాన్ని దూరం చేయటం కోసం బీజేపీతో సంబంధాలున్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నది. ఇది పచ్చి అబద్ధమని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్‌లో మూలాలున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై బీజేపీ విధానాలను కాంగ్రెస్‌లో అమలు చేస్తున్నాడని అన్నారు. నిర్మల్, గోషామహల్, దుబ్బాక, ముథోల్ సహా అనేక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ పోటీలో దించింది. ఇది రేవంత్ రెడ్డి పన్నాగం అని అన్నారు.
బీజేపీతో, కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం పెట్టుకొని బీఆర్స్‌ను దెబ్బతీయటానికి ఈ ఎన్నికల్లోనే కాదు గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. హుజూరాబాద్, దుబ్బాక, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. లోపాయికారి ఒప్పందం లేకపోతే ఇదెలా సాధ్యం. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలు, గంగా జమునా తెహజీబ్ సహజ సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని అండగా ముస్లిం సమాజం ఆశీర్వదించండని మంత్రి కోరారు.