వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే.. కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి అని అన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకుంటే అంతకన్నా బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. సీతారామ ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ ఉన్న మాట అంటే కాంగ్రెస్ మంత్రులకు ఉలుకెందుకు? ఓ మంత్రి కంటతడి పెట్టారు.. ఎందుకో ఆశ్చర్యం కలిగింది. హరీష్ రావు మాట్లాడిందాంట్లో అన్‌పార్లమెంటరీ ఏముంది అని అడిగారు.
కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి.. కనీసం బటన్ నొక్కేపుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పండని మంత్రులను కోరుతున్నా. రైతు రుణమాఫీకి 12 వేల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు అని దుయ్యబట్టారు.
గురుకులాల్లో పరిస్థితులకు కూడా కేసీఆర్ కారణమని భట్టి అంటున్నారు.. ఇంత కన్నా దారుణం ఉంటుందా? రోజూ మీరు పళ్ళు తోముకోక పోతే బాధ్యత కేసీఆర్‌దా? ఉత్తమ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.. కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నారా? సీతారామ ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరసగా కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే ఈ అనుమతులు వచ్చాయి అని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టుపై కనీసం ఒక ఉత్తరమైనా రాశారా? కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తప్పటడుగు వేసి బీఆర్ఎస్ ఒత్తిడితో వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ హయంలో లాగా కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ప్రాజెక్టు అంచనాలు పది, పదిహేను రెట్లు పెంచలేదు అని జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు.
కమీషన్లు ఇవ్వడం తీసుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు.. కాలువలు తవ్వక ముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పదహారు చోట్ల కొబ్బరికాయలు కొట్టినా పనులు జరిగాయా? కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారు అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు, వైఎస్సార్ భజన చేస్తున్నారు.. వాళ్లిద్దరూ తెలంగాణలో ఒక్క ఎక్కరానికైనా నీళ్లు ఇచ్చారా? వైఎస్సార్ హయాంలో ఆంధ్రా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తయి..
తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయి.. వైఎస్సార్ రాయలసీమకు 350 టీఎంసీల సామర్ధ్యమున్న ప్రాజెక్టులు పూర్తి చేశారు.. తెలంగాణకు ఏం చేశారు అని ప్రశ్నించారు.
వైఎస్, చంద్రబాబుల హయాంలో తెలంగాణలో మూడున్నర క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న చెరువునైనా కట్టారా? ఎవరి హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు పూరయ్యాయో చర్చకు వస్తారా ఉత్తమ్ కానీ భట్టి గానీ.. నేను చర్చకు ఎక్కడైనా రావడానికి రెడీ అని సవాల్ విసిరారు.
నీళ్లిస్తే వడ్లు పండుతాయని.. వడ్లు పండితే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వడం లేదు. కాళేశ్వరం నుంచి అవకాశం ఉన్నా నీళ్లు తోడటం లేదు.. తెలంగాణ పాలిట ద్రోహులు ఎవరో, దొంగలు ఎవరో తేలాల్సిందే అని అన్నారు.
ఎస్సార్బీసీ, ఎస్సెల్బీసీ ఒకేసారి మొదలయ్యాయి.. ఎస్సార్బీసీ పూర్తయ్యింది.. ఎస్సెల్బీసీ ఇంకా పూర్తికాలేదు. ఎస్సెల్బీసీపై కాంగ్రెస్ మంత్రులు హంతకులే సంతాప సభ పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు.. సీతారామ ప్రాజెక్టుపై మంత్రులు మాట్లాడిన ప్రతీ వాక్యం అబద్ధమే. మంత్రులు మాట్లాడిన దానిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమే అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకు ముందుంది మొసళ్ల పండగ.. కొందరు పైసల బలుపుతో మరికొందరు ఒళ్ళు బలిసి మాపై మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు అని ధ్వజమెత్తారు.
తెలంగాణలోనే తెలంగాణ బిడ్డలను స్థానికేతరులను చేసే విధంగా జీవో 33 తెచ్చారు. ఇంత కన్నా తెలంగాణకు ద్రోహం ఏముంటుంది.. రేవంత్ తన ఆంధ్రా మిత్రులనో చంద్రబాబునో సంతృప్తి పరచడానికే జీవో 33 తెచ్చారా? ఇప్పటికైనా జీవో 33 పై ప్రభుత్వం సోయి తెచ్చుకుని వ్యవహరించాలి అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
కేసీఆర్ ఎంతో కష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించారు.. జీవో 33ను వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.