తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పత్తి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు. పధకం ప్రకారం రైతులను దళారీలకు, మిల్లర్లకు వదిలేశారు అని ఆరోపించారు.
దీని వెనుక వందల కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వంలో మంత్రులు దళారులతో, మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ పండిన ప్రతి గింజను కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారు అని అన్నారు.
నల్గొండ జిల్లా మంత్రి దళారులతో కుమ్మక్కయ్యి వందల కోట్లు వసూలు చేశారు.. 2014కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి. రైతులు ఎందుకు దోపిడీకి గురవుతున్నారో సీఎం, వ్యవసాయ శాఖా మంత్రి సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క గింజ సన్న వడ్లు ప్రభుత్వం కొనలేదు. సమాధానం చెప్పడానికి అధికారులు భయపడుతున్నారు అని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు. సమస్యలు పక్కదారి పట్టడానికి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారు. మర్చిపోయారు అంటున్న కేసీఆర్‌ను చూసి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం. కేసీఆర్ రాహుల్ గాంధీని ఏమన్నాడు. కేసీఆర్‌ను చూస్తే వణుకు ఎందుకు అని ప్రశ్నించారు.
కొడంగల్‌లో అధికారులపై జరిగిన దాడి రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు మొదలయింది. కేసీఆర్‌ను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి రేవంత్ రెడ్డి టైంపాస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మంచుతున్నారు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. చెడ్డ పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు. ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతోంది అని జగదీశ్ రెడ్డి అడిగారు.
రాష్ట్రంలో మేధావులు కొడంగల్‌కు వెళ్లి రావాలి. ఎంత వరి, పత్తి కొన్నారో వ్యవసాయ శాఖా మంత్రి, సివిల్ సప్లైస్ శాఖా మంత్రి సమాధానం చెప్పాలి. కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదు. కొడంగల్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ అనడంలో ఆశ్చర్యం లేదు. కొడంగల్‌లో ఏం జరిగిందో మేధావులు, ఆచార్యులు, పౌర హక్కుల నేతలను పంపాలి అని అన్నారు.
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి 25 సార్లు వెళ్ళారు. ఢిల్లీ వెళ్లి ఎవరి కాళ్ళు మొక్కారో ప్రజలకు తెలుసు. ఉదయం రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాత్రి మోడీ, అమిత్ షా కాళ్ళు రేవంత్ రెడ్డి పట్టుకుంటున్నారు. కేటీఆర్ చెప్పి ఢిల్లీకి వెళ్లారు.. కేటీఆర్ ఎక్కడ వున్నారు ఎవరిని కలిశారు.. నీ ఇంటిలిజెన్స్ ఉంది కదా. కేటీఆర్ ఢీల్లికి వెళ్ళింది కాంగ్రెస్, బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికి అని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నుండి రూ. 300 కోట్లు పంపారు అని ఆరోపించారు.
ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలియదా.. రేవంత్ రెడ్డికి సీనియర్లు చెప్పే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు అని పేర్కొన్నారు.
ఎవిడెన్స్ కోసం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దానికి మాజీ ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తారు. మహారాష్ట్రలో ఎవరు గెలిస్తే మాకేంటి? ఓడితే మాకేంటి? కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగారు.
వాల్మీకి స్కామ్‌లో ఎందుకు బీజేపీ విచారణ చేయడం లేదు. రాష్ట్ర మంత్రిపై జరిగిన ఈడీ రైడ్స్‌ను ఎందుకు బయటపెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయం అని జగదీష్ రెడ్డి అన్నారు.