mt_logo

భయపెట్టి పాలన చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు: జగదీశ్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల బాధితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి చేశారు. పోలీసుల కనుసన్నల్లోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగింది అని ఆరోపించారు.

ట్రాఫిక్ సిగ్నల్ ఆపి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసేందుకు పోలీసులు సహకరించారు. కేటీఆర్ కారుపై ఎక్కి దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు అని దుయ్యబట్టారు.

మూడు నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపై కాంగ్రెస్ దాడులు చేస్తోంది. వరద బాధితులు, మూసీ నిర్వాసిత బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు
ఎన్నికల ఫలితాల తర్వాత గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై దాడులు చేశారు అని గుర్తు చేశారు.

సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. ఖమ్మంలో వరద బాధితుల వద్దకు హరీష్ రావు, మేము వెళ్తే మాపై దాడి చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. భయపెట్టి పాలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు అని మండిపడ్డారు.

కేటీఆర్ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై విచారణ చేయాలి. డీజీపీ, హైదరాబాద్ సీపీ తమ సిన్సియారిటీని నిరూపించుకోవాలి. నర్సాపూర్‌లో మా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేశారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు.

అధికారులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో మేము లిస్ట్
రెడీ చేస్తున్నాం. కాన్వాయ్‌పై దాడి ఘటనలు చిల్లర వేషాలు, కుప్పిగంతులు. రేవంత్ రెడ్డి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీతో వుండే వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను స్పెషల్ పర్పస్ వెహికిల్‌లా మార్చుకున్నారు అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీని పాత నాయకులు రక్షించుకోవాలి. తాను సీఎం కావడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకున్నారు. డీజీపీ, సీపీకి సోయి లేదా? ఖమ్మం పోలీస్ కమీషనర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పని చేస్తున్నారు. ఖమ్మంలో మాపై దాడి చేసి మా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. దాడులపై చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రక్షణ లేకపోతే
ఎట్లా? మూసీ నదిని మురికి కూపంగా చేసింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే. దమ్ముంటే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి మాట్లాడాలి అని సవాల్ విసిరారు.

మూసీ ప్రణాళిక, డీపీఆర్ ప్రభుత్వం వద్ద ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వాలు పాడు చేసిన హుస్సేన్ సాగర్, మూసీలను కేసీఆర్ ప్రభుత్వం బాగు చేసింది. కాంగ్రెస్ మూసీని మురికిగా మార్చింది.. నల్గొండ‌కు ఫ్లోరిన్ అందించింది అని విమర్శించారు.

గోదావరి కృష్ణా నీళ్లను కిందకు మళ్లించింది.. ట్రీట్మెంట్ ప్లాంట్లతో మూసీ, హుస్సేన్ సాగర్ల నీళ్లను మురికి వాసన లేకుండా చేసింది కేటీఆరే. కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదు అని పేర్కొన్నారు.

పోలీస్ కమిషనర్ ఆఫీస్ తెలంగాణ భవన్ పక్కనే ఉంది. తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తే కమిషనర్ ఏం చేస్తున్నట్టు. ఎవరి మీద కేసులు పెట్టారు? పోలీసులు కాంగ్రెస్ దాడులను ఆపకపోతే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది అని అన్నారు.

పోలీసులు మాకు రక్షణ కల్పించకపోతే మాకు ఏం చేయాలో తెలుసు. ఇకనైనా పోలీసులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అని సూచించారు.