mt_logo

దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏం చేతకావడం లేదు: జగదీష్ రెడ్డి

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వ సత్తా ఏమిటో తెలిసిపోయింది.. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారు. ఏదో సాధించినట్టుగా కేసీఆర్‌ను రావాలి రావాలి అని అడుగుతున్నారు అని విమర్శించారు.

గురుకులాల్లో స్థితిగతులను అధ్యయనం చేయడానికి వెళితే విద్యార్ధి సంఘాలను అడ్డుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలు అద్భుతంగా తీర్చిదిద్దబడితే రేవంత్ ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోంది అని దుయ్యబట్టారు.

కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్‌తో పాటు కిలిమంజారో పర్వతం అధిరోహించారు. గురుకులాల్లో అధ్వానంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశాం. మా విద్యార్ధి విభాగం గురుకులాల్లో సమస్యలు అధ్యయనం చేస్తే రేవంత్ రెడ్డి కి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని ప్రశ్నించారు.

అసెంబ్లీ సమావేశాలున్న నేపథ్యంలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికే మా బృందాలు పర్యటిస్తున్నాయి. గురుకులాల్లో అన్నీ బాగుంటే రేవంత్ ఈ పర్యటనలు ఎందుకు అడ్డుకుంటున్నారు. విద్యార్థులను కలిసేందుకు మా వాళ్ళను రేవంత్ రెడ్డి ఆపుతున్నారు.. విద్యార్థులే రోడ్ల మీదకు వస్తున్నారు.. ఎంత మందిని అడ్డుకుంటావు? మేము అక్కడికి ధర్నాలు చేయడానికో తరగతుల బహిష్కరణకో వెళ్లడం లేదు అని జగదీశ్ రెడ్డి అన్నారు.

లగచర్లకు వెళతామంటే అనుమతి ఇవ్వరు.. మహబూబాబాద్‌లో మా మీటింగ్‌కు అనుమతివ్వరు. ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు, ఎంత కాలం ఈ మోసాలు. స్కూలు పిల్లలకు అన్నం కూడా సరిగా పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు.

రైతు రుణమాఫీ పది కోట్ల రూపాయల మేర కూడా కాలేదు.. ఎవరొస్తారో రండి చర్చకు. వడ్ల కొనుగోలుపై ఇప్పటికీ లెక్కలు చెప్పడం లేదు. రైతు భరోసా కన్నా బోనస్ బాగుందని చెప్పడానికి మంత్రికి సిగ్గు ఉండాలి అని ఫైర్ అయ్యారు.

పోలీసులకు తప్ప ఏ శాఖకు పని లేదు. దోచుకుని ఢిల్లీకి మూటలు పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదు.ఏం చేశారని సంబురాలు చేసుకుంటున్నారు? ఢిల్లీ బానిసలకు అధికారం అప్పజెప్పొద్దని కేసీఆర్ మొత్తుకున్నారు. ఏడాదిలో సీఎం 30 సార్లు ఢిల్లీ వెళ్లారు? ఏం సాధించారు? అని అడిగారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు. మా విద్యార్ధి విభాగం నాయకుల గురుకులాల సందర్శనను పోలీసులు అడ్డుకోవద్దని మనవి. బూటకపు ఎన్‌కౌంటర్లు ఎక్కడా జరిగినా తప్పే. కేసీఆర్ హయాంలో ఒక ఎన్‌కౌంటర్ జరిగితే పొలీసు ఉన్నతాధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఆ తర్వాత తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలనలో ఒక్క ఎన్‌కౌంటర్ జరగలేదు అని తెలిపారు.

రేవంత్ పాలనలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 14 మంది చనిపోయారు. ఏ ఎన్‌కౌంటర్ పైనైనా ఆరోపణలు వస్తే ఖచ్చితంగా విచారణకు ఆదేశించాలి. ప్రభుత్వాన్ని నడిపేది బీఆర్ఎస్‌యే అయినట్టు కాంగ్రెస్ నేతలు ప్రతి అంశంలో మా కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. గురుకులాల్లో విషాహారానికి బీఆర్ఎస్ కుట్ర అనడానికి సిగ్గుండాలి అని ధ్వజమెత్తారు.

పాలన చేతకాకనే బీఆర్ఎస్‌పై నిస్సిగ్గుగా విమర్శలు చేస్తున్నారు. వివిధ శాఖలకు మంత్రులు లేకపోవడం కూడా ప్రభుత్వ వైఫల్యాలకు ప్రధాన కారణం. విద్యా శాఖకు మంత్రి లేకపోవడం ఏమిటి. విద్యా శాఖ కీలకమైందన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. రేవంత్ రెడ్డికి దేనిపై పట్టింపు లేదు.. వేరే విషయాలపై ఆయనకు శ్రద్ధ ఉంది. విద్యా శాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం దుర్మార్గం అని పేర్కొన్నారు.

సీఎంకు మంత్రివర్గ విస్తరణ చేసే దమ్ము లేదు.. కనీసం వేరే మంత్రులకు విద్యా శాఖ అప్పగించాలన్న ఇంగితం సీఎంకు లేదు. ప్రజలు కేంద్రంగా రేవంత్ ప్రభుత్వం పని చేయడం లేదు.తనకిష్టమైతే తప్ప మంత్రులను సీఎం కలవడం లేదు.. ఇక అధికారులను ఏం కలుస్తారు? కనీసం కోదండరాంకైనా సీఎం విద్యా శాఖను కేటాయించాలి.. తన శత్రువులుగా ఉన్న మంత్రులకైనా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా సీఎం రేవంత్ సోయి తెచ్చుకుని పాలన చేయాలి. గురుకులాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్‌పై ఆందోళనగా ఉన్నారు ఆదివారం నాడు తమ పిల్లలను గురుకులాల్లో కలిసేందుకు తల్లిదండ్రులకు అనుమతివ్వరా.. గురుకులాలను జైళ్లుగా మారుస్తున్నారా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.