mt_logo

సమైక్యవాదం కాదది ఉన్మాదం-నాగం

తెలంగాణ ప్రజలను అడుగడుగునా దోపిడీ చేస్తూ కలిసి ఉండాలని కోరడం సమైక్యం కాదని, అది ఒక ఉన్మాదమని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బిల్లుపై చర్చను అడ్డుకుంటూ సీమాంధ్రులు చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. సీమాంధ్ర పెత్తనాన్ని చెలాయించడానికే హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారని, బీదర్, గుల్బర్గా ప్రజలేమైనా విడిపోతామన్నారా? ఎన్నాళ్ళు నీటి దోపిడీ చేస్తారని సీమాంధ్రకు చెందిన నేతలను ప్రశ్నించారు. తెలుగు భాష మీద అంతప్రేమే ఉంటే పక్కనే ఉన్న యానాంను ఎందుకు కలుపుకోలేదని, అక్కడ దోచుకునేందుకు ఏమీలేదనే కలుపుకోలేదని మండిపడ్డారు. నీటి దోపిడీపై బ్రిజేష్‌కుమార్ కమిటీ సీమాంధ్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా తప్పుబట్టిందని, అయినా వారికి బుద్ధి రాలేదని, విడిపోతే ఎలా బతుకుతారని తెలంగాణ ప్రజలను అపహాస్యం చేస్తున్నారని నాగం విమర్శించారు. మెజారిటీ ప్రాంతంతో కలిసేందుకు తెలంగాణ ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారని ఫజల్అలీ కమిషన్ చెప్పిందని గుర్తుచేశారు. తెలంగాణకు మెజార్టీ ఉంటుందని కన్నడ మరాట్వాడా ప్రాంతాలను పక్క రాష్ట్రాల్లో కలిపి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. నీటిదోపిడీ ఎన్నివిధాలుగా చేశారో పూర్తి వివరాలు వెల్లడించారు. తాగడానికి చుక్క మంచినీరు ఇవ్వకుండా నల్గొండ ప్రజలను ఫ్లోరైడ్ బాధితుల్ని చేశారని, కనీస సానుభూతి లేని సీమాంధ్ర పాలకులకు కలిసుందామనే నైతిక హక్కు లేదని తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రాష్ట్రపతి పంపిన బిల్లులో తప్పులున్నాయని అన్న సీఎంకు ఇన్నిరోజులబట్టి తెలియలేదా? అని ప్రశ్నించారు. సీఎం లెక్కలన్నీ తప్పు అని, తెలంగాణపై మొసలికన్నీరు కురిపించొద్దని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *