తెలంగాణ బిల్లుపై చర్చ జరక్కుండా ఆఖరిదశలో అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతలను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని, ఎంతవరకైనా వెళతామని తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతవరకూ వచ్చాక వెనక్కు వెళ్ళేదిలేదని, తాడోపేడో తేల్చుకుంటామని, సీమాంధ్రుల కుట్రలను తిప్పికొట్టడానికి అన్ని పార్టీల నేతలు ఒకే తాటి మీద ఉండాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగ బద్ధంగా వచ్చిన బిల్ల్లును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిని సభలోనే ఎదుర్కోవాలని తెలంగాణ ఎమ్మెల్యేల భేటీలో తీర్మానించారు. ఆదివారం సాయంత్రం మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో జరిగిన భేటీలో తెలంగాణ ఎమ్మెల్యేలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. బిల్లును వెనక్కు పంపాలని సీఎం ఇచ్చిన నోటీసును పట్టించుకోవద్దని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను తెలంగాణ ప్రాంత నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ దామోదర రాజనర్సింహ ఒక లేఖను స్పీకర్‌కు అందచేశారు. అందులో ఉన్న సమాచారం ఈ విధంగా ఉంది. సీఎం తనను గానీ, మంత్రులను గానీ సంప్రదించకుండా బిల్లును వెనక్కుపంపాలని ప్రభుత్వం తరపున పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని, మంత్రివర్గ సమిష్టి బాధ్యత స్పూర్తికి విరుద్ధమని, ప్రభుత్వమంటే మంత్రిమండలి తప్ప ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. తెలంగాణ తీర్మానం పార్లమెంటు అధికారాలకు లోబడి ఉంది. తెలంగాణ బిల్లు నిబంధనల ప్రకారం శాసనసభ అభిప్రాయాల వ్యక్తీకరణకే పరిగణించాలని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల్లో రూల్ 77 క్రింద సీఎం ఇచ్చిన నోటీస్ చెల్లదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్రాసిన లేఖలో సూచించారు. వీరే కాకుండా తెలంగాణ మంత్రులంతా ఎవరికివారే స్పీకర్‌కు లేఖలు వ్రాశారు. సీఎం చర్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు మంత్రులు గవర్నర్‌కు కూడా లేఖలు సమర్పించారు.