అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలో ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ ఆగస్టు నుండి వచ్చే నవంబర్ వరకు ఏయే శాఖల్లో కొత్త ఉద్యోగాలు నింపుతారో ప్రకటించారే తప్ప.. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వలేదు.
అందుకే ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఒక జోక్ క్యాలెండర్ అని.. ఇదంతా బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది.. కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అని బీఆర్ఎస్ ఎందుకు ఆరోపిస్తుందో పరిశీలిస్తే.. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌లోని డొల్లతనం బయటపడుతుంది.
- ఏదైనా క్యాలెండర్ అంటే అది ఒక సంవత్సర కాలానికి సంబంధించినది. కానీ కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ మాత్రం విచిత్రంగా ఆగస్టు 2024 నుండి నవంబర్ 2025 వరకు విస్తరించింది.
- జాబ్ క్యాలెండర్ ఏదైనా రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా విడుదల చేయబడితే దానికి ఒక విశ్వసనీయత, హేతుబద్ధత అనేది ఉంటుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో జాబ్ క్యాలెండర్‌ను యూపీఎస్సీ విడుదల చేస్తుంది. కానీ అందుకు విరుద్ధంగా.. తెలంగాణ జాబ్ క్యాలెండర్ ని మాత్రం టీఎస్పీఎస్సీ విడుదల చేయలేదు.
- టీఎస్పీఎస్సీ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ, అది తెలంగాణ ప్రభుత్వం కింద పనిచేయదు. కాబట్టి టీఎస్పీఎస్సీ విడుదల చేయని ఈ క్యాలెండర్‌ను ఎంత వరకు నిరుద్యోగులు నమ్మొచ్చు అనేది పెద్ద ప్రశ్న.
- ప్రతి చిన్న ప్రారంభోత్సవంలో పాల్గొనే సీఎం రేవంత్ రెడ్డి.. బహుశా ఈ మెలికలన్ని చూసే.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసే పనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పచెప్పారెమో అని టాక్ నడుస్తుంది.
- అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం, నేటికి ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. డిసెంబరు 2024 నాటికి కాంగ్రెస్ పార్టీ వారిచ్చిన 2 లక్షల ఉద్యోగాల వాగ్దానంలో 2% కూడా భర్తీ చేయలేదని ఈ జాబ్ క్యాలెండర్ రుజువు చేస్తోంది.
ఇవన్నీ చూస్తే.. కేవలం నిరుద్యోగుల ధర్నాలు, యువతలో కాంగ్రెస్ పార్టీపై పెల్లుబికుతున్న ఆగ్రహాన్ని కొంత చల్లార్చాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఈ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జాబ్ క్యాలెండర్ పేరుతో తెలంగాణ యువతను కాంగ్రెస్ మళ్ళీ వంచింది అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.