mt_logo

ఇందిరమ్మ ఇవ్వాలనుకున్నది…

By: -కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి

ఇందిరాగాంధీ 1972లో పార్లమెంటులో చేసిన ప్రసంగపాఠాన్ని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోర్‌కమిటీ సమావేశంలో అందులోని కొన్ని అంశాలను చదివి వినిపిన్చినట్లు మీడియాలో ‘లీకు’ స్టోరీలు వచ్చాయి. రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లోనూ విభజన కోసం ఉద్యమాలు (1969, 1971) జరిగినా ఆమె అంగీకరించలేదని, రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన కోర్‌కమిటీలో చెప్పారట! అలాంటి ఇందిరమ్మ అభిమతానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేయగలమా అంటూ కిరణ్ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాడట!

ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వాలనుకున్నది నిజం. ఆమె ఒక దశలో తెలంగాణ ఇవ్వడానికే సిద్ధపడ్డ విషయాన్ని మరుగు పరిచి, ఇవ్వకూడదనేదే అమె నిశ్చితాభిప్రాయమైనట్లుగా వక్రీకరించడం సరికాదు. ఆ రోజుల్లో రాజకీయ అనివార్యతల వల్ల ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వలేకపోయారు తప్ప, ఎప్పటికైనా తెలంగాణ ఇవ్వకూడదనేది ఆమె అభిమతం కాదని చరిత్ర చెప్తున్నది. అలాగే ఇందిరకు ఆకాలంలో కొన్ని సంక్లిష్టతల వల్ల ఇవ్వలేకపోయారనేది నిజం. ఓవైపు బంగ్లాదేశ్ యుద్ధం, మరోవైపు అంతర్జాతీయ ఒత్తిళ్లలోఉన్న ఇందిర రాజకీయ సంక్లిష్టతలను మనం అర్థం చేసుకుంటే, ఆమె రాష్ట్ర విభజనపై పార్లమెంటులో చేసిన ప్రసంగం ఆమె నిజమైన ఆలోచనలకు ఎంతమాత్రం అద్దంపట్టవు.

1969 తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్‌పార్టీ చీలిపోయింది. అప్పుడు ఇందిరమ్మ కమ్యూనిస్టులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపింది. విశాలాంధ్ర సిద్ధాంతకర్తలైన కమ్యునిస్టులపై ఆధార పడ్డ ఇందిరమ్మ తెలంగాణ విషయంలో ముందడుగు వేయలేకపోయింది. ఆంధ్రాప్రాంత నేతలు మేనేజ్ చేసే పాలసీని అప్పుడు కూడా అమలు చేశారు. సహజంగా మెజారిటీ ప్రాంతపు ఆంధ్రా నేతల అజమాయిషీలో కొనసాగుతున్న కమ్యూనిస్టులు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారు.

అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి టి.ఎన్.కౌల్ రాసిన పుస్తకం ( Reminiscences )లోని పేజీ నెం. 187లో ఆ విషయం స్పష్టంగా ఉన్నట్లు కెప్టెన్ పాండురంగారెడ్డి లాంటి వారు ఎన్నోసార్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రాంభించవలసిందిగా ఇందిర తన పీఎంఓ కార్యాలయ సీనియర్ సెక్రటరీ పీ.ఎన్. హుస్కర్‌ను ఆదేశించారని తన పుస్తకంలో టీఎన్ కౌల్ (విదేశాంగ కార్యదర్శి) స్పష్టంగా రాశారు. అయితే అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి అయిన తాను జోక్యం చేసుకోవడంతో, ఆమె తన ఆదేశాన్ని విరమించుకున్నారని కౌల్ తన పుస్తకంలో రాశారు. విదేశీ కార్యదర్శి కౌల్ ఎందుకు జోక్యం చేసుకున్నారు? అనే ప్రశ్నకు దొరికే జవాబే…ఇందిరాగాంధీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని మనకు స్పష్టం చేస్తుంది. హైదరాబాద్ (నిజాం రాజ్యం) కేసు ఐక్యరాజ్యసమితిలో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని విదేశీ కార్యదర్శి కౌల్ ఇందిరకు గుర్తుచేశారు. దానితో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ కోసం పీఎంఓ కార్యదర్శి హుస్కర్‌కు తాను ఇచ్చిన ఆదేశాలను ఇందిర విరమించుకున్నారు. ఈ విషయాలన్నీ ఎవరూ సొంతంగా చెపుతున్నవి కావు. ఇందిర ప్రభుత్వంలో విదేశీ కార్యదర్శిగా పనిచేసిన టీఎన్ కౌల్ తన పుస్తకంలో రాసిన చారిత్రక నిజాలు! అలాంటి పచ్చి నిజాలను పక్కన పెట్టి, ఇందిర తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమంటూ అదరగొట్టి తెలంగాణను అడ్డుకోవాలనుకోవడం తెలివైన పని కాదు.

యుఎన్‌ఓలో హైదరాబాద్ కేసు పెండింగ్‌లో ఉన్నందువల్ల అప్పట్లో ఆమె తెలంగాణ ఇవ్వలేకపోయారు. అయినా కూడా ఆమె తెలంగాణ ఇవ్వాలనుకున్నదని అమెరికా పత్రికలో వచ్చిన ఓ వ్యాసం ఆనాడే బయటపెట్టింది. అప్పట్లో అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, వాషింగ్టన్ డీసీ లో- క్లైడ్ ఎగ్లెటన్ రాసిన – The case of Hyderabad before the security council – అనే తన వ్యాసంలో – యుఎన్‌ఓ లో హైదరాబాద్ కేసు అయిపోగానే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని భారత ప్రభుత్వం అలోచిస్తున్నదని ఆ వ్యాసంలో రాశారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ వినిపించిన ఇందర ప్రసంగం 1972 నాటిది. అప్పటీకీ యుఎన్‌ఓలో హైదరాబాద్ కేసు పెండింగ్‌లోనే ఉంది. కాబట్టి అలాంటి సంక్లిష్టతలను దృష్టిలో పెట్టుకునే ఆమె పార్లమెంటులో ఆ రకంగా ప్రసంగించక తప్పలేదనే విషయం ఎవరూ మర్చిపోకూడదు. మొత్తం మీద భారత ప్రభుత్వ వాదనలతో, హైదరాబాద్ కేసును యుఎన్‌ఓ సెక్యురిటీ కౌన్సిల్ 1979 సెప్టెంబర్ 2న కొట్టేసింది. అ రోజు నుంచి తెలంగాణ ఏర్పాటుకు ఉన్న అవరోధం తొలగిపోయింది.1977లో ఓడిపోయిన ఇందిర తిరిగి 1980లో అధికారంలోకి వచ్చారు. రెండేళ్లు గడిచాయో లేదో 1982లో రాష్ట్రంలో ఒక సినిమాపార్టీ(తెలుగుదేశంపార్టీ) పుట్టుకొచ్చింది. తెలంగాణ అస్తిత్వాన్ని శాశ్వతంగా తుడిచేసేందుకే తెలుగుదేశం పేరుతో ఆంధ్ర పార్టీ పుట్టుకొచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుట్టుకతో తెలంగాణ ప్రయత్నాలు మరుగున పడ్డాయి.

1984లో ఇందిరమ్మ మరణించారు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యారు. రాజీవ్‌గాంధీ మొదటి ఎస్‌ఆర్‌సీని గౌరవించారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాల ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని కేబినెట్ మంత్రి (పీఏ సంగ్మా)ని ఆదేశించారు. రెండు ప్రాంతాల్లో పర్యటించి అన్ని విషయాలను తెలుసుకున్న సంగ్మా 1988లో ప్రధాని రాజీవ్‌గాంధీకి నివేదిక సమర్పించారు. 1989లో రాజీవ్‌గాంధీ అధికారం కోల్పోయారు. విపీసింగ్, దేవెగౌడ, గుజ్రాల్, వాజ్‌పేయి..ఇలా అన్ని ప్రభుత్వాలూ తెలుగుదేశం మద్దతుపై అధారపడిన ప్రభుత్వాలే వచ్చాయి. మధ్యలో పీవీ ప్రభుత్వం 5 ఏళ్లు పాలించినా.. అది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతును పరోక్షంగా పొందిందే. పీవీ ప్రభుత్వం తెలంగాణపై అలోచించి ఉండాల్సిందనుకుంటే, అది మన దురాశే అవుతుంది.

ఇందిర కాలం నుంచి నేటిదాక 1969 నుంచి 1984 వరకు ఇందిరమ్మ తెలంగాణను ఇవ్వలేకపోయిందని చెప్పాలె తప్ప అమె తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకమనడంలో ఏమాత్రం నిజంలేదు. ఇందిరమ్మ సెంటిమెంటును సీఎం కిరణ్ కోర్‌కమిటీ సభ్యులపై రుద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇందిర వ్యక్తిత్వం, మనస్తత్వం, అప్పటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల సంక్లిష్టతల గురించి తెలిసిన కోర్‌కమిటీ సభ్యులు…ఆమె తెలంగాణ ఇవ్వలేకపోయారనే విషయం తెలియనివారేంకారు. నిజం చెప్పాలంటే, ఇందిరమ్మ దృక్పథాన్ని చాలా దగ్గరగా చూసిన సోనియాగాంధీ అప్పటి రాజకీయ సంక్లిష్టతల వల్లనే ఇందిర తెలంగాణ ఇవ్వలేకపోయారని ఇప్పటికే తెలుసుకొని ఉండకపోరు.

ఇవాళ తెలంగాణ ఇవ్వడానికి హైదరాబాద్ కేసు వంటి అడ్డంకులు లేవు. బంగ్లాదేశ్ వంటి విముక్తి యుద్ధాలు లేవు. కమ్యూనిస్టులపైగానీ,తెలుగుదేశంపైగానీ ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం కాదు. యుపీఏలో సోనియా మాటను కాదనే మిత్రపక్షాలు లేవు. అత్తకు(ఇందిరమ్మకు) ఎదురైన సంక్లిష్టతలు కోడలు (సోనియా)కు లేవు.అన్నీ సానుకూల పరిస్థితులే ఉన్నాయి.

వివిధ సంక్లిష్టతల వల్ల ఇందిరమ్మ ఇవ్వలేకపోయిన తెలంగాణను ఇపుడు సోనియా ఇవ్వగలిగితే… ఇందిరమ్మ అభిమతానికి మరింత గౌరవం పెరుగుతుంది తప్ప కిరణ్ చెపుతున్నట్లు ఇందిరమ్మ అభిమతం ఎంతమాత్రం తరిగేది కాదు.ఇందిర ప్రసంగం వినిపించి అందరినీ గోల్‌మాల్ చేద్దామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి 1956లో నిజామాబాద్ సభలో నెహ్రూ ఏమన్నాడో కూడా చెప్పి ఉండాలి కదా! ‘ఆంధ్రతో తెలంగాణ విలీనం తుంటరి పిల్లవానితో అమాయకపు పిల్ల పెండ్లి వంటిది. ఐక్యత కుదరకపోతే విడాకులిచ్చుకోవచ్చు’ అని నెహ్రూ చెప్పిన చారిత్రక వ్యాఖ్యలను కూడా కిరణ్ వినిపించి ఉండాల్సింది కదా! ఇందిరమ్మ ఆలోచనల పట్ల కిరణ్‌కు అంత అభిమానమే ఉంటే… రాజ్యాంగ పీఠికలో అప్పటికే ఉన్న డెమోక్రటిక్, రిపబ్లిక్, సెక్యూలర్‌తోపాటు, ఇందిరమ్మ 1975లో చేర్చిన ‘సోషలిస్టు’ పదాన్ని ఏమేరకు గౌరవిస్తున్నారో అడగలేదెందుకో! ఇందిరమ్మ తెచ్చిన సోషలిజం పదాన్ని పక్కన పెట్టి ఇవాళ క్యాపిటలిజం నడుపుతున్న వారికి, నిజంగా ఇందిరమ్మ అభిమతాల మీద ఇవాళ ఎందుకు అంత ప్రేమ పుట్టుకొస్తున్నది? తెలంగాణ ఇవ్వొద్దని కిరణ్‌కుమార్ రెడ్డి తన అభివూపాయం చెపితే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఒక మహా నాయకురాలి అభిమతాలను తప్పుదారి పట్టించి తెలంగాణను అడ్డుకోవాలనుకోవడమే అభ్యంతరకరం.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *