mt_logo

టాప్ 5 కంపెనీల కార్యాలయాలు హైదరాబాద్ లోనే..

ఇండియన్ సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ ఎదుగుతున్నదని, ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీల కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేయడంతో పాటు, ఉత్పత్తి, పరిశోధనారంగాల్లో హైదరాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి అనూప్ వదవాన్ పేర్కొన్నారు. కేంద్ర ఐటీ, శాస్త్ర సాంకేతికశాఖ సారధ్యంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఎస్ సీ) నిర్వహించే ఇండియా సాఫ్ట్ 19వ ఎడిషన్ సోమవారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ప్రారంభం అయింది. రెండురోజులపాటు జరగనున్న ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన అనూప్ వదవాన్ మాట్లాడుతూ ఇండియన్ స్టార్టప్ హబ్ గా హైదరాబాద్ ఎదిగిందని, అనేక ఆవిష్కరణ సంస్థలు నగరంలో ఉన్నాయని అన్నారు.

హైదరాబాద్ ఐటీ పరిశ్రమ ఎగుమతుల వృద్ధి భారతదేశ సగటును మించి ఉందని, నైపుణ్యం గల మానవవనరులు, ఉత్తమ విద్యాసంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థల సహకారంతో హైదరాబాద్ నగర ఐటీ పరిశ్రమ విశేష అభివృద్ధి సాధిస్తున్నదని ఆయన ప్రశంసించారు. ఇండియా సాఫ్ట్ చైర్మన్ నలిన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ సదస్సుకు 200కు పైగా దేశ,విదేశీ కంపెనీలు హాజరుకావడం సంతోషంగా ఉందని, ఉత్తమ ఆతిథ్యం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ వై2కే సమస్య వచ్చిన నాటినుండి భారతీయులు ఐటీ రంగంలో తమ సత్తా చాటుతున్నారని, ఇందులో హైదరాబాద్ లోని కంపెనీలు తమ ప్రత్యేకతను చాటుకున్నాయని తెలిపారు. ప్రపంచంలోని టాప్ 5 కంపెనీలు తమ ప్రధాన కార్యాలయం తర్వాత అంతటి ముఖ్య కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమని జయేష్ రంజన్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *