ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణకు చెందిన ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఆందోళన చేశారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వారు ఈ ఆందోళన చేపట్టినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న స్వంతంత్ర జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ, రైతుబంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి అని ఆరోపించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు.. కానీ పరిస్థితులు అలా లేవు. రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చాం. అనుమతించకపోవడంతో రాహుల్ ఇంటి ముందు జర్నలిస్టుల సమస్యలపై నిరసన తెలుపుతున్నాం అని తెలిపారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర జర్నలిస్టులు పనిచేయడం లేదు.. అలా చేస్తే మాపై కేసులు పెట్టుకోవచ్చు. ప్రజా సమస్యలు, వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదు అని వారు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితి తెలిపేందుకు ఢిల్లీ వచ్చాం. ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశాం.. మేము ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయడం లేదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న స్వతంత్ర జర్నలిస్టులం అని అన్నారు.