mt_logo

అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యం: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

– తెలంగాణ‌లో అడవుల పునరుద్ధరణకు సమగ్ర కార్యాచరణ

– అటవీ సంరక్షణ, పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్ర‌భుత్వ‌ కృషి

– అటవీ ప్రాంత ప్రకృతి పునరుద్ధరణ-జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహల అభివృద్ధి స‌దస్సును ప్రారంభించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా అడ‌వుల పునరుజ్జీవ‌నం, అట‌వీ ప్రాంతాల్లో ప్రకృతి పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందిచ‌డ‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు.

అటవీ ప్రాంత పునరుద్ధరణ
(Forest Landscape Restoration) – జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహల అభివృద్ధి స‌దస్సును మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప్రారంభించారు. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్సర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర, రాష్ట్ర‌ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖల సంయుక్త భాగ‌స్వామ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అటవీ ప్రాంతాలను పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామ‌న్నారు. నాలుగేళ్ల‌ కిందట ప్రారంభమైన పునరుద్ధరణ పనుల సత్ఫలితాలు ఇప్పుడు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయన్నారు. తెలంగాణలో పచ్చదనాన్ని 33 శాతం పెంచడానికి పెద్ద ఎత్తున తెలంగాణకు హరితహారం కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ‌లో పచ్చదనం, అటవీ ప్రాంత పునరుద్ధరణ 3 లక్షల హెక్టార్లకు పెరిగిందని వెల్లడించారు. వ‌చ్చే ఐదేండ్ల‌లో 10 ల‌క్ష‌ల‌ హెక్టార్ల అడ‌వుల‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అట‌వీ పున‌రుజ్జీవ‌, పునరుద్ధరణ కార్య‌క్ర‌మంలో భాగంగా 2 ల‌క్ష‌ల 65 వేల హెక్టార్ల‌లో అటవీ స‌రిహ‌ద్దుల ర‌క్ష‌ణ‌, నేలలో తేమను నిలుపుకోవడం, అగ్ని ప్ర‌మాద నిరోధించ‌డంతో పాటు ఇత‌ర చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ఉపయోగపడితే అడవుల పెంపకం మొత్తం వాతావరణంలో మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవటానికి, జీవ వైవిధ్యానికి, నీటి నిర్వహణకు దోహదపడుతుందని వెల్లడించారు. ఇందుకోసం జాతీయ ఉపాధి హామీ నిధులను సమర్ధవంతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణకు హరితహారం అద్భుత కార్యక్రమమ‌ని, పర్యావరణ రక్షణకు ఇది ఎంతో దోహ‌దప‌డుతుంద‌ని సదస్సులో పాల్గొన్న భార‌త‌ అటవీ పరిశోధన మండ‌లి డీజీ సురేష్ గైరోల అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని చక్కగా అమలు చేస్తోందని ప్రశంసించారు. మిగతా రాష్ట్రాలు కూడా హరితహారం అధ్యయనం చేసి, అమలు చేయాలని, అలా అయితేనే జాతీయ స్థాయి సగటు అటవీ విస్తీర్ణం 33 శాతానికి చేరుకోగల‌ము అని తెలిపారు.

సదస్సులో పాల్గొన్న వివిధ జాతీయ అటవీ, పర్యావరణ సంస్థల ప్రతినిధులు పర్యావరణపరంగా వస్తున్న మార్పులు, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అటవీ నిర్వహణ, కర్బన ఉద్గారాల తగ్గింపులో అటవీశాఖ పాత్రలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, యూఎస్ ఎయిడ్ ఇండియా ప్రతినిధి వర్గీస్ పాల్, కేంద్ర అటవీ శాఖ ఐజి పంకజ్ ఆస్థాన, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ సుభాష్ అషుతోష్, అటవీ పరిశోధన డీజీ సురేష్ గైరోల, పీసీసీఎఫ్ ఆర్. శోభ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ MD రఘువీర్, రిటైర్డ్ అటవీశాఖ ఉన్నతాధికారులు BSS రెడ్డి, PK ఝా, అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.