mt_logo

ధరణి వద్దని దండుకోవాలని దుండగులు చూస్తుర్రు ప్రజాలారా జాగ్రత్త

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారంనాడు నాగర్‌కర్నూల్‌ సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌ కాలేజీతోపాటు బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తూ.. తెలంగాణను ఆగం చేసినోళ్ళే కొత్త ముసుగులు వేసుకొని, కొత్త వేషాలు వేసుకొని బయలుదేరారన్నారు. ఒక ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చర్లలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ ను తొలగించి బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నాడు,  ఇంతకుముందు రికార్డు అసిస్టెంట్లు, వీఆర్వోలు, గిర్దావర్లు, ఎమ్మార్వోల చేతిలో మన బతుకు ఉండేది. వారు రాసిందే రాత, గీసిందే గీత. మన రికార్డు ఉన్నదో లేదో, మన భూమి మనకే ఉన్నదో లేదో తెల్వదు. పహాణీ నకల్ కావాలన్నా పైసలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. 

కానీ ఇవ్వాల ఏం జరిగింది ? నేను మీకు కొన్ని విషయాలు విన్నవించుకోవాలనుకుంటున్నాను. తెలంగాణ రాకముందుకు తెలంగాణలో 459 మండలాలుంటే ఇవ్వాల 612 మండలాలకు పెంచుకున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ లో గతంలో  64 మండలాలుంటే నేడు 76 మండలాలకు పెంచుకున్నాం.. నాడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులుంటే నేడు అదే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయన్నారు. 

 ధరణితోని 99 శాతం సమస్యలు పరిష్కారం 

నేడు ధరణితో  అవినీతి తొలిగిపోయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా, పారదర్శకంగా జరుగుతున్నదన్నారు.  పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మరో పది నిమిషాల్లో పట్టా తయారై పాసుబుక్కు చేతికిస్తారు. అంతకుముందు ఎన్ని దస్తర్ లు తిరగేది, ఎంత మందికి సలామ్ కొట్టాల్సి ఉండేది. ఎంతమంది లీడర్ల పైరవి చేయమనేది అని ప్రశ్నించారు. ఆ గతి పోయి నేడు నిశ్చింతగా రైతు గుండె మీద చేయి వేసుకొని ఉన్నాడు,  నేడు భూముల అమ్మకాలు, కొనుగోళ్ళలో  యాజమాన్యాన్ని మార్చే అధికారం రైతుకే ఇచ్చినం. ఆయన బొటనవేలుతో నొక్కితే తప్ప రికార్డు మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడా లేదు. ధరణి బంగాళాఖాతంలో విసిరేస్తే రైతుబంధు ఈ పద్ధతిలో వస్తుందా ? ధరణిని బంగాళాఖాతంలో వేసుడు కాదు రైతును బంగాళాఖాతంలో వేసుడు అయితది. పైరవికార్లు, లంచగొండులు ఎవరైతే రైతుల రక్తం తాగిన్రో వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారన్నారు. 

కాంగ్రెస్ రాజ్యంలో రైతు చచ్చిపోతే ఆపద్బంధు అని ఉండేది. 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పేది,  నడిమధ్యల ఎందరో తిన్నంక, చెప్పులు అరిగితే పదో ఇరవయ్యో చేతుల పెట్టి ఇంటికి పంపించేది. ఇది మీరందరు యాదికి చేసుకొనండని గుర్తు చేసారు. నేడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమైతయ్. ధరణి ఉంది కాబట్టే ఇది సాధ్యమైతున్నదన్నారు. ధరణి ఉండబట్టే  కంప్యూటర్లో ఉన్న రికార్డులను బట్టి మీ వడ్లు కొన్నంక వారం రోజుల్లో పైసలు అకౌంట్లలో పడుతున్నాయి. ధరణి ఆగమైతే వస్తాయా ? ధరణి ఉండాలా .. తీసెయ్యాలా .. మీరే చెప్పండని అడిగారు. (ధరణి ఉండాలని ప్రజల నుంచి సమాధానం) ఈ దుర్మార్గులు, ప్రబుద్ధులు ఒక్కనాడైనా ప్రజల గురించి ఆలోచించలేదు, ధరణితోని 99 శాతం సమస్యలు పరిష్కారమైనవి. ఒకటో రెండో ఉంటే అవి కూడా పరిష్కారమైతయని చెప్పారు. 

ధరణి తీసేస్తే దోపిడే మళ్ళా మొదలైతది..  

రైతు వేలి ముద్ర తప్ప ఇతర ఏ శక్తి రైతు యాజమాన్య హక్కును మార్చలేదన్నారు.మీరు ఈ మాటలు ఇక్కడే విని ఇక్కడే మర్చిపోవద్దు. మీతోటి వాళ్ళతో చర్చించండి. వాస్తవాలు తేలాలి,  ఆగమాగం కావద్దు. ఆగమాగమైతే తెలంగాణే వచ్చేది కాదు. ధరణి తీసేస్తే దోపిడే మళ్ళా ప్రారంభమైతుంది. కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం, పైరవీకారుదలదే భోజ్యం,  లంచాల పీడ లేకుండా చేసిన ధరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. బాధకు గురికావద్దు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. 

కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టే.. 

ఇవ్వాల ధరణి లేకపోతే పెరిగిన భూముల ధరలతో ఎన్ని పంచాయతీలు అయితుండేవి, వడ్లు అమ్మంగానే పైసలు వచ్చి బ్యాంకులు పడుతున్నాయని గుర్తు చేసారు. రైతుబంధు పైసలు పడుతున్నాయి. రైతు తన అవసరాలు తీర్చుకుంటున్నాడు. ధరణి లేకపోతే రైతులు పంచాయతీలు పెట్టుకుంట కోట్ల చుట్టూ తిరగాలని అడిగారు.  రైతులను కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ, వకీళ్ళ చుట్టూ తిరిగే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇది నిజమా కాదా మీ గుండె మీద చేయి వేసుకొని చెప్పండి అని అడిగారు.  రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ధరణి వంటి కార్యక్రమాలు రైతును కంటికి రెప్పలా కాపాడుకునేందుకే తెచ్చినమన్నారు. మోసపోతే గోసపడతాం. రైతులు కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండాలి, ఆంధ్రోళ్ళు తెలంగాణ వస్తే మీ రాష్ట్రంలో కారుచీకట్లు కమ్ముకుంటాయని అన్నారు. కానీ నేడు మన రాష్ట్రం వెలుగు జిలుగులతో అలరారుతున్నదన్నారు సీఎం.

బీసి కులాల వృత్తులకు ఆర్థిక సాయం ఈ నెల 9 వ తేదీ నుండి

గిరిజనులకు పోడు భూములు పంచుతున్నాం, సొంత జాగా ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాను అన్నారు. పూసల కులస్తులు, జంగం, బుడగజంగాళవాళ్ళు, కంసాలులు, కమ్మర్లు మొదలైన అణగారిని బీసి కులాల వృత్తి పనివారికి కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని ఈ నెల 9 వ తేదీ నుండి ప్రారంభిస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానని అన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చాంతాడంతా సంఖ్యలో పథకాలను అమలుచేస్తున్నదని, కంటి వెలుగు ద్వారా ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలు ఉచితంగా అందిస్తున్నదని, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు… ఇలా బాధల్లో ఉన్నవారి బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. 

తెలంగాణ ప్రజలే నా బలగం…నా బంధువులు. మళ్ళొక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా… ధరణి పోర్టల్ ఉండాలా .. .తీసేయాలా ? అని ప్రశ్నించగా ప్రజలంతా ఉండాలని సమాధానమిచ్చారు. ధరణిలో ఏమైనా సమస్యలుంటే మీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు చెప్పండని చూచించారు.  నిమిషాల్లో అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటారు. దాని గురించి ఇబ్బంది లేదన్నారు.