mt_logo

ధూమ్ ధామ్ గా సండే-ఫండే.. వేలాదిగా తరలి వచ్చిన సందర్శకులు

చిన్నారుల కేరింతలు, సెల్ఫీల యువత సందడితో, నోరూరించే వంటకాలతో, తెలంగాణ సంప్రదాయాలతో ఆదివారం సాయంత్రం హుస్సేన్ సాగర తీరం జన జాతరను తలపించింది. ఓ వైపు వినోదం, మరోవైపు సామాజిక అవగాహన, ఇంకోవైపు శారీరక వ్యాయామ ప్రాధాన్యాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ధూమ్‌ ధామ్‌గా సండే-ఫన్‌డే సాగింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘సన్‌ డే ఫన్‌ డే’ కార్యక్రమం నగరవాసుల మది దోచింది. పైసా ఖర్చు లేకుండా వంద శాతం ఆహ్లాదం పంచే వేదికగా స్థానం సంపాదించుకుంది. ఓ నగర పౌరుని అభ్యర్థన మేరకు పర్యాటకులకు వినోదమే లక్ష్యంగా ఆగస్టు 29 నుండి ప్రతీ ఆదివారం టాంక్‌బండ్‌ను ట్రాఫిక్‌ ఫ్రీగా కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. గత వారాలకు భిన్నంగా ఈ సారి మధ్యాహ్నం 3 గంటల నుంచే అనుమతి ఇవ్వడంతో రాత్రి పది గంటల వరకు నగరవాసులు భారీ సంఖ్యలో తరలొచ్చారు. వినూత్న వేషధారణతో, డప్పు చప్పుళ్లతో, పోతరాజుల విన్యాసాలతో పలువురు ఆకట్టుకోగా.. రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యాండ్‌ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతవారానికి భిన్నంగా ఈ వారం లేసర్ షో, బాణాసంచా హరివిల్లులు ప్రతిఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మరోవైపు ఫుడ్‌కోర్టుల్లోని నోరూరించే వంటకాలను నగరవాసులు ఆరగించారు. చిన్నా పెద్దా సెల్ఫీలతో సందడి చేశారు. అలాగే ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మొక్కలు, మాస్కులను పంపిణీ చేశారు. భారీ ఎత్తున తరలి వచ్చిన సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెచ్‌ఎండీఏ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పనిచేయగా, సిటీ పోలీస్‌ అధికారులు, షీ టీమ్స్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *