తెలంగాణలో గత నాలుగు రోజులుగా కరెంట్‌పై చర్చ నడుస్తున్నది. అమెరికాలోని తానా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన అసత్యపు వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది. అన్నదాతల పంట పండేందుకు సీఎం కేసీఆర్ ఎంతో శ్రమించి ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్ అవసరమే లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎకరానికి గంట చొప్పున మూడు గంటలు కరెంట్ ఇస్తే మస్త్ అని ప్రేలాపనలు చేశారు. దీనిపై యావత్తు తెలంగాణ రైతాంగం భగ్గుమన్నది. రేవంత్‌రెడ్డితోసహా కాంగ్రెస్ పార్టీ నాయకులెవరినీ ఊళ్లలోకి రానియ్యమని రైతులు ఫ్లెక్సీలు కట్టారు. కాగా, రేవంత్‌రెడ్డి చెప్పిన కరెంట్ లెక్క పూర్తిగా అవాస్తవమని వ్యవసాయ, నీటిపారుదల శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. గంటలో ఎకరం పారడం అనేది అసంభవమని స్పష్టం చేశారు. వరిసాగుకు అయితే కచ్చితంగా 18 గంటల కరెంట్ ఉండాల్సిందేనని, ఉద్యాన పంటలకు 5 గంటల కరెంట్ కావాలని కళ్లకు కట్టేలా వివరించారు.
ఎకరం పారేందుకు 6 గంటల కరెంట్ తప్పనిసరి
ఎకరం పారాలంటే గంట కరెంట్ చాలు.. ఇది రేవంత్‌రెడ్డి తిక్క లెక్క.. కానీ ఎకరం వరిపొలం పారాలంటే కచ్చితంగా ఆరు గంటల కరెంట్ ఉండాల్సిందేనని అగ్రికల్చర్ సైంటిస్టులు చెప్తున్నారు. వరిసాగుకు వంద రోజుల సమయం పడుతుందని.. ఈ లెక్కప్రకారం చూసుకొంటే రోజుకు 60 వేల లీటర్లు కావాలని వివరించారు. ఇంత మొత్తంలో ఓ 5 హెచ్‌పీ మోటర్ నీటిని ఎత్తిపోయాలంటే ఆ బోరు కనీసం 5-6 గంటలన్నా నడవాలని అంటున్నారు. తొలిసారి మడి తయారుచేసుకొనేందుకు ఒక ఎకరం నీళ్లు పారియ్యాలంటే కనీసం రెండు రోజులు పడుతుందని చెప్తున్నారు. దీని ప్రకారం రోజుకు 18 గంటల కరెంట్ ఉంటేనే రైతులు సాఫీగా పంట పండిచొచ్చని అంటున్నారు. ఉద్యానవన పంటలకు ఈ లెక్క వేరుగా ఉంటుందని, ఎకరం పారేందుకు 5-6 గంటల కరెంట్ కావాలని చెప్తున్నారు. మొత్తంగా ఒక ఎకరం వరికి 60 వేల నీటర్ల నీళ్లు.. కూరగాయలు, పండ్లు, పూల సాగుకు 30 వేల లీటర్ల నీళ్లు కావాలని, స్థానికుల పరిస్థితులను బట్టి ఈ లెక్కలో స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉండడంతో రైతులు ఎప్పుడంటే అప్పుడు మోటరు ఆన్ చేసుకొని కావాల్సినన్ని నీళ్లను పారించుకుంటున్నారని చెప్పారు. ఒకవేళ ఈ కరెంట్‌ను 3 గంటలకు కుదిస్తే సాగు కనాకష్టమవుతుందని చెప్తున్నారు.