mt_logo

కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!

కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అని ఊదరగొట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే ఫార్ములా హర్యానాలోనూ వాడి ఏడు గ్యారెంటీలు అనే నినాదంతో ముందుకు వెళ్ళింది. కానీ హర్యానాలో మాత్రం బొక్కబోర్లా పడింది.

వాస్తవానికి హర్యానాలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని కొన్ని నెలల నుండి మీడియాలో, సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరిగింది. రెండు రోజుల క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా ఇదే చెప్పాయి.

కానీ ఈరోజు ఫలితాలు రావడం మొదలయ్యాక కాంగ్రెస్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. ఏడు గ్యారెంటీలను ఆశగా చూపి.. పదేళ్ల బీజేపీ పాలనపై ఉన్న వ్యతిరేకత ద్వారా హర్యానాలో పీఠం దక్కించుకోవాలని చూసిన కాంగ్రెస్ పార్టీకి ఆశాభంగం కలిగింది.

గ్యారెంటీల పేరుతో కర్ణాటక, తెలంగాణలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ పాచిక హర్యానాలో మాత్రం పారలేదు. దీనికి బలమైన కారణాలు లేకపోలేదు.

కాంగ్రెస్ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మిన కర్ణాటక, తెలంగాణ ప్రజలు.. ఆ హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పాలనపై ఇప్పటికే విసుగెత్తి ఉన్నారు, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పనితీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

పైగా, కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ కోసం సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డిలు పలు కుంభకోణాలకు కూడా పాల్పడుతున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటి ప్రభావం హర్యానాలో కాంగ్రెస్ పార్టీపైన పడింది. 

కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో ఇప్పటికే సతమతమవుతున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను చూస్తున్న హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే ధైర్యం చేయలేదు.

పైపెచ్చు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ.. తెలంగాణలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తున్న కూడా నోరు మెదకపోవడంతో కాంగ్రెస్ చిత్తశుద్ధిపై అనామనాలు రేకేత్తాయి.

ఇవన్నీ గమనించిన హర్యానా ఓటర్లు, కాంగ్రెస్ కంటే ఇప్పుడున్న బీజేపీనే బెటర్ అని అనుకున్నట్టున్నారు.