mt_logo

సిద్దిపేట జిల్లాలో రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయి: మంత్రి ఉత్తంకు హరీష్ రావు లేఖ

సిద్దిపేట జిల్లాలో ఎండిపోతున్న రిజర్వాయర్ల గురించి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయి అని పేర్కొన్నారు

లేఖ యధాతధంగా 👇🏼

సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.

గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్‌లో 3.32 టీఎంసీల నీళ్ళు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు, రంగనాయక సాగర్‌లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్‌లో 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్‌లో 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.

ఒకవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలు వేయాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తీర్ణం కూడ తగ్గిపోయింది. కాబట్టి రాజకీయాలు పక్కనబెట్టి మిడ్ మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని, అదేవిధంగా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం పక్షాన కోరుతున్నాను