mt_logo

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు.. ప్రజా సంక్షేమంలో లాభ నష్టాలు చూసుకోరు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునేవారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారు అని పేర్కొన్నారు.

మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టకరం. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశ్యంతో కేసీఆర్ గారి ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చింది. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వంద శాతం ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయడం సాధ్యమయింది.. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి, ఈ మిషన్ భగీరథ దండుగ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత శోచనీయం అని హరీష్ రావు విచారం వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథ కోసం మా ప్రభుత్వం రూ. 35 వేల కోట్లు ఖర్చు చేస్తే, దాన్ని రూ. 50 వేల కోట్లకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. మిషన్ భగీరథ ద్వారా ఏం లాభం తెచ్చారని, దానికి తెచ్చిన అప్పుకు వడ్డీ ఎలా కడుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.. ఇంతకన్నా దౌర్భాగ్యమైన, భావ దారిద్ర్యమైన ఆరోపణ ఇంకోటి ఉండదు అని అన్నారు.

అసలు మిషన్ భగీరథ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏమిటి? అనే విషయాలపై కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేకపోవడం బాధాకరం. తెలంగాణ రాకముందు తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాల సంఖ్య కేవలం 5,672 అయితే, 2023 పూర్తయ్యే నాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయి. 2014కు ముందు కేవలం 30 శాతం ఇండ్లకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యం ఉండేది. అదిప్పుడు వంద శాతానికి చేరుకుంది అని తెలిపారు.

గిరిజన తండాలు, గోండు గూడాలు, ఆదివాసీ పల్లెలకు మంచినీటి సౌకర్యం లేక ప్రతీ ఏడాది వర్షాకాలంలో విష జ్వరాలు, అంటు రోగాలు, కలుషిత నీటితో అనేక మంది మరణించేవారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందడం వల్ల నేడు మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు సురక్షిత మంచినీరు తాగుతున్నారు. సురక్షితమైన మంచినీరు అందుబాటులో లేకపోవడం వల్లనే ప్రజలు ఆనేక వ్యాధుల బారిన పడుతున్నట్లు డబ్ల్యుహెచ్వో ప్రకటించింది అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం నల్లాల ద్వారా మంచినీరు  ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. మిషన్ భగీరథ పథకాన్ని ప్రజల ఆరోగ్యం కాపాడిన గొప్ప సంజీవనిగా చూడాలి తప్ప, అందులో లాభనష్టాలు బేరీజు వేసుకోవడం ఒక ప్రభుత్వాధినేతకు తగదని హరీష్ రావు సలహానిచ్చారు.

ఇక మాట్లాడితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కానీ, ఫలితం లేదని విమర్శిస్తున్నారు. ప్రాణహిత- చేవెళ్లను కాదని కాళేశ్వరం కట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని మేము అసెంబ్లీలో చాలా స్పష్టంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా వివరించాం. అయినా అవే విమర్శలు చేయడం తగదు అని సూచించారు.

2007లో ప్రాణహిత-చేవెళ్లకు శంఖుస్థాపన చేసి, 2014 వరకు అంటే ఏడేళ్లు ఏ పనీ చేయకుండా ఎందుకు చేతులు ముడుచుకుని కూర్చున్నారు అంటే సమాధానం ఉండదు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా చెబితే అది చెవికెక్కదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ బ్యారేజి మాత్రమే కాదు అని మొత్తుకున్నా వీళ్లకు వినిపించదు అని విమర్శించారు.

ఎస్ఆర్ఎస్పీ ద్వారా అటు కోదాడ వరకు, ఇటు డోర్నకల్ వరకు నీరందించగలిగామంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనుల వల్లనే అంటే వీరికి అర్థం కాదు. 1956 నుండి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందిస్తే, గడిచిన తొమ్మిదిన్నరెళ్ళలోనే మా ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిందని లెక్కలు, ఆధారాలతో సహా చెప్పినా వీరికి అవగాహన కలగదు అని హరీష్ రావు అన్నారు.

రైతులకు సాగునీరు ఇవ్వడాన్ని, ప్రజలకు మంచినీరు ఇవ్వడాన్ని కూడా లాభనష్టాలతో బేరేజు వేసుకునే ప్రభుత్వం ఒకటి వస్తుందని తెలంగాణ ప్రజలు కలలో కూడా ఊహించి ఉండదు. బీడుబడ్డ భూముల్లో సిరులు పండుతుంటే రైతులు పడే సంతోషం చూడాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వంతో లాభ నష్టాలు చూడవద్దని కోరుతున్నాను అని తెలిపారు.

ఇక లాభ నష్టాల విషయానికే వస్తే, గతంలో తాగునీటి కోసం అక్కా చెల్లెల్లు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. బిందెలతో నీళ్ళు మోసి నడుములు వంగేవి. భుజాలు కాయలు కాసేవి. ట్యాంకర్ల ముందు కొట్లాటలు జరిగేవి. తాగునీటి కోసం పడిన ఆ అక్కా చెల్లల్ల కష్టాలను లాభ నష్టాలతో లెక్కగడతామా? సురక్షితమైన మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల రాష్ట్రంలో కోటి కుటుంబాలు రోజుకొక క్యాను చొప్పున బయట మంచినీళ్లు కొనుక్కునే వారు. ఇప్పుడు ఆ ఖర్చు ప్రజలకు తప్పింది. ఇది లాభం కాదా? అని ప్రశ్నించారు.

గతంలో ప్రతీ ఏడాది బోర్ల కోసం, బావుల కోసం, మోటార్ల రిపేర్ల కోసం ఇటు ప్రభుత్వం, అటు గ్రామ పంచాయతీలు వేలాది కోట్లు ఖర్చు చేసేది. ఇప్పుడా భారం తప్పింది. ఇది లాభం కాదా? 2014-15 లో 1.31 కోట్ల ఎకరాల్లో పంట సాగు జరిగితే, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం వల్ల 2022-23 నాటికి అది 2.08 కోట్ల ఎకరాలకు చేరింది. రైతుల ఆదాయం పెరిగింది. ఇదిలాభం కాదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రం ఆవిర్భావానికి ముందు 1.98 లక్షల టన్నుల మత్స్య సంపద ఉండగా.. నేడు అది 4.24 లక్షల టన్నులకు పెరిగింది. ఎంతో మందికి ఉపాధి కలిగింది. ఇది లాభం కాదా? ప్రాజెక్టుల ద్వారానే మంచినీటికి కొరత లేకుండా నిండువేసవిలో కూడా నల్లాల ద్వారా మంచినీరు ఇవ్వగలుగుతున్నాం. ఇది లాభం కాదా? తెలంగాణలోని వేలాది పరిశ్రమలకు నిరంతరాయంగా ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఇది లాభం కాదా? అని రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్న వేశారు.

కొన్ని పెట్టుబడులకు ప్రత్యక్షంగా లాభం వస్తే, కొన్నింటికి పరోక్ష ఫలితాలుంటాయి. ఆసరా పెన్షన్ల ద్వారా కూడా వేల కోట్లు ఖర్చు అవుతుంది. దాని వల్ల లాభం లేదంటారా? రైతుబంధు ద్వారా వేల కోట్లను రైతులకు అందించాం. లాభం లేని పథకం కాబట్టి దాన్ని రద్దు చేస్తారా? ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంటు, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాల వల్ల కూడా ప్రత్యక్ష లాభం కనిపించదు. అయితే వాటిని రద్దు చేస్తారా? అని అడిగారు.

ఇక పాడిందే పాటరా అన్నట్లు ప్రతీసారి అప్పుల ముచ్చట చెబుతారు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ కూడా తెలంగాణ రాష్ట్రం పరిమితికి లోబడే అప్పులు చేశాయని చాలాసార్లు స్పష్టం చేశాయి. ఫోర్బ్స్ ఇండియా తాజా నివేదికలో కూడా జీఎస్డీపి – అప్పుల నిష్పత్తి అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి 25 శాతం అయితే, తెలంగాణ అప్పు 23.8 శాతమే అనే విషయం రేవంత్ రెడ్డికి తెలియదా? అని హరీష్ ప్రశ్నించారు.

అప్పుల గురించి ఇంత మాట్లాడిన వారు 2024-25 బడ్జెట్లో లోటును అప్పుల ద్వారా సమకూర్చుకుంటామని ఎందుకు చెప్పారు? ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాకమందే వేల కోట్ల అప్పులు ఎందుకు తెచ్చారు? ఇంకా మాపై విమర్శలు చేసి కాలక్షేపం చేయాలంటే కుదరదు. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. ప్రభుత్వం మొన్ననే ఏర్పడింది కదా అని ప్రజలు ఊరుకుంటున్నారు. మీరు ఇచ్చిన హామీలే మీకు ఉరితాళ్లుగా మారబోతున్నాయి. ముందు ఆ హామీల గురించి మాట్లాడండి అని సూచించారు.

రేవంత్ రెడ్డి గారు ప్రతీ సారి నా ఎత్తు గురించి వ్యాఖ్యానిస్తున్నారు.
నేను కూడా మీ ఎత్తు గురించి మాట్లాడితే సంస్కారవంతంగా ఉండదు. ఎవరెత్తు ఎంత అనేది ప్రజలకు అవసరం లేదు… ప్రజలకోసం ఎవరెంత ఆలోచిస్తున్నారో, ఎవరెంత పనిచేస్తున్నారో మాత్రమే వారికి అవసరం అని స్పష్టం చేశారు.