mt_logo

మంచి పనులు చేసిన సర్పంచులకు రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నాడు: హరీష్ రావు

మాజీ సర్పంచుల అరెస్టులకు నిరసనగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మాజీ మంత్రి హరీష్ రావు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు ఛలో హైదరాబాద్‌కు పిలుపునిస్తే, వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గమైన చర్య.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.

అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయడం హేయమైన చర్య. ఇలా ఇప్పటికే పలుమార్లు చేశారు.. సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది అని దుయ్యబట్టారు.

అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేసామని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు అడిగితే ఈ ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారు. ఉత్తమమైన గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకం అని కొనియాడారు.

మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్నా అని అడిగారు.

ప్రభుత్వం వచ్చి 10 నెలలు దాటింది పది లక్షల బిల్లులు కూడా వారికి చెల్లించలేదు. నాలుగైదు సారు హైదరాబాద్‌కు వచ్చి మొర పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి సర్పంచులను చర్చలకు పిలవండి, వెంటనే వారి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి అని హరీష్ రావు కోరారు.

రూ. లక్షా 50 వేల కోట్లతో మూసి బాగు చేస్తా అంటున్నావు. కానీ గ్రామాలను ఎంతో అభివృద్ధి చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నావు.. సర్పంచుల అరెస్టులు పరిష్కారం కాదు, సర్పంచుల ఫోన్లు గుంజుకొని టెర్రరిస్టుల లెక్క పోలీసు స్టేషన్లకు తీసుకుపోతున్నారు. మేము వచ్చి వారి బాధలు వినాలని వస్తే వారిని వెంటనే డీసీఎంలలో ఎక్కించి తరలిస్తున్నరు. పాపం భార్య పిల్లలబంగారం అమ్మి పనులు చేసారు అని అన్నారు.

భట్టి విక్రమార్క గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మాజీ సర్పుంచులు ఉన్నారు.. నిన్నకాక మొన్న బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు వీరికి ఎందుకు ఇవ్వడం లేదు. ఉన్న భూమి జాగ అమ్ముకుంటున్నారు.. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.